ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశ రాజకీయాలను కుదిపేస్తోన్న సంగతి తెలిసిందే. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరిగిన ఈ కుంభకోణం దేశంలోని పలు రాష్ట్రాల రాజకీయాలలోనూ దుమారం రేపుతోంది. తెలంగాణలో ఎమ్మెల్సీ కవిత పేరు ఈ స్కాంలో వినిపిస్తుండగా..ఏపీ నుంచి వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేరు మొదటి నుంచి వినిపిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆ స్కాంలో సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతితో పాటు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిల పేర్లు కూడా తెరపైకి రావడం సంచలనం రేపుతోంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో వైఎస్ భారతి, విజయసాయిరెడ్డిల పాత్ర ఉందని టీడీపీ నేత పంచుమర్తి అనురాధ సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ పై సీబీఐ వేయబోయే ఛార్జిషీట్లతో తాడేపల్లి ప్యాలెస్ పునాదులు కదులుతాయని అనురాధ షాకింగ్ కామెంట్లు చేశారు. ఆ లిక్కర్ స్కామ్ లో జగన్ అవినీతిని బట్టబయలు చేసినందుకే టీడీపీపై ప్రభుత్వం కక్ష కట్టిందని అనురాధ మండిపడ్డారు.
ఆ కారణంతోనే చంద్రబాబు కుటుంబంపై వైసీపీ నేతలు అవాస్తవాలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. తమ తప్పును కప్పిబుచ్చుకునేందుకే నారా భువనేశ్వరి, బ్రాహ్మణిలపై విమర్శలు చేస్తున్నారని అనురాధ చెప్పారు. ఎన్టీఆర్ ట్రస్ట్, హెరిటేజ్ ద్వారా ప్రజా సేవ చేస్తున్న వారిపై ఆరోపణలు చేయడం ఏమిటని అనురాధ ఫైర్ అయ్యారు. లిక్కర్ స్కామ్ నుంచి తన వాళ్లను రక్షించుకునేందుకే జగన్ ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారని అనురాధ ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎవరెవరి పాత్ర ఉందో కేంద్రం వెంటనే తేల్చాలని అనురాధ డిమాండ్ చేశారు.
కాగా, చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణికి మద్యం వ్యాపారంలో రోజూ ఆదాయం వస్తోందని.. వాళ్లు చేసేది పాల వ్యాపారం కాదని.. మద్యం వ్యాపారమని వైసీపీ నేతలు ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ హయాంలోనే రాష్ట్రంలో ఎక్కువ బ్రాండ్లు పుట్టుకొచ్చాయని వైసీపీ నేత, ఎమ్మెల్సీ పోతుల సునీత నిరాధారమైన ఆరోపణలు చేశారు. అయ్యన్నపాత్రుడు, యనమల రామకృష్ణుడు, ఆదికేశవులనాయుడు డిస్టిలరీల నుంచి చంద్రబాబు కుటుంబానికి ముడుపులు వెళ్లాయని ఆరోపించారు.