మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి పేరు బలంగా వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఒకసారి అవినాష్ రెడ్డిని విచారణ జరిపిన సీబీఐ…తాజాగా మరోసారి విచారణకు రావాలంటూ నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి పాత్రపై ప్రాసంగిక సాక్షాలున్నాయంటూ సీబీఐ వెల్లడించిందని ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఒక కథనం ప్రచురితమైంది.
అవినాశ్ రెడ్డే చంపించారు అనే శీర్షికతో ప్రచురితం అయిన ఆ కథనం రాష్ట్ర రాజకీయాలలో సంచలనం రేపుతోంది. ఎంపీ సీటుకు అడ్డు రావడంతోనే వివేకాను అవినాష్ రెడ్డి తొలగించుకోవాలనుకున్నారని సీబీఐ విచారణలో వెల్లడైనట్టుగా ఆ కథనంలో ప్రచురితమైంది. వివేకాను హత్య చేసేందుకు దేవి రెడ్డి శివ శంకర్ రెడ్డితో అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి కుట్ర పన్నారని ఆ కథనంలో ప్రచురితమైంది. ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, దస్తగిరి, ఉమా శంకర్ రెడ్డిలతో కలిసి శివశంకర్ రెడ్డి ఈ హత్యకు స్కెచ్ వేశారని, అయితే శివశంకర్ రెడ్డి పరోక్షంగా పాల్గొన్నారని, మిగతా నలుగురు ప్రత్యక్షంగా పాల్గొన్నారని కథనంలో ప్రచురితమైంది.
గొడ్డలివేటును గుండెపోటుగా మార్చడంలో, రక్తపు మరకలు తుడిచివేయడంలో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిల పాత్ర ఉందని గతంలోనే సిపిఐ వెల్లడించిందని ఆ కథనంలో ప్రచురించారు. హత్యకు ముందు రోజు సాయంత్రం అవినాష్ రెడ్డి ఇంట్లోనే సునీల్ యాదవ్ ఉన్నారని, మిగతా నిందితులు కూడా అక్కడ కలుసుకున్నారని వెల్లడించింది.
అయితే, ఈ కథనం నేపథ్యంలో పులివెందులలో ఆంధ్రజ్యోతి దినపత్రిక ప్రతులను వైసీపీ నేతలు దగ్ధం చేసిన ఘటన సంచలనం రేపుతోంది. పులివెందుల మున్సిపల్ చైర్మన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ దాష్టీకంపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. వాస్తవాలు వెల్లడించే పత్రికలను తగలబెట్టడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.