యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు అరెస్ట్ వ్యవహారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశం అవుతోంది. ఐఏఎస్ అధికారి హనుమంతు చిన్న కొడుకైన ప్రణీత్.. తెలుగు సోషల్ మీడియా సర్కిల్స్‌లో బాగానే పాపులర్. సినిమా వాళ్ల మీదే కాక బయటి వాళ్ల మీద రోస్ట్ వీడియోలు చేస్తూ అతను పాపులారిటీ సంపాదించాడు. ఐతే గతంలో కొన్ని వీడియోలు అభ్యంతరకరంగా ఉన్నా జనాలు పట్టించుకోలేదు.
కానీ ఒక చిన్న పాపతో ఓ తండ్రి బంధాన్ని అవహేళన చేస్తూ లైంగిక పరమైన కామెంట్లు చేయడం దుమారం రేపి.. దాని మీద టాలీవుడ్ సెలబ్రెటీలు పెద్ద ఎత్తున స్పందించడం.. సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరగడంతో చివరికి తెలంగాణ ప్రభుత్వం జోక్యం చేసుకుని ప్రణీత్‌ను బెంగళూరులో అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తీసుకొచ్చారు.
ప్రణీత్ కుటుంబానికి ఉన్న పేరుకు.. అతను చేస్తున్న పనులు, కామెంట్లకు అసలు పొంతన కుదరడం లేదు. ప్రణీత్ తండ్రి హనుమంతు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కావడంతో వారి కుటుంబానికి ఇది మచ్చగా మారింది. ఇప్పటిదాకా హనుమంతు అయితే ఈ వ్యవహారం మీద స్పందించలేదు. మరోవైపు ప్రణీత్ అన్న అజయ్ హనుమంతు కూడా యూట్యూబరే. అతడికి 2.69 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉండడం విశేషం. ప్రణీత్ వ్యవహారంలో అతను కూడా సోషల్ మీడియాలో వ్యతిరేకత ఎదుర్కొంటున్నాడు.
ఈ నేపథ్యంలో అజయ్ మీడియాకు ఒక వీడియో రిలీజ్ చేశాడు. తాను చాలా సెన్సెటివ్ అని.. తాను ఇప్పటిదాకా క్రియేట్ చేసిన కంటెంట్ చూస్తే అది అర్థమవుతుందని.. ప్రణీత్ వీడియోలను, తన వ్యాఖ్యలను తాను ఎంతమాత్రం సమర్థించనని.. అని చెప్పాడు. తాను ఆరేళ్ల కిందట పెళ్లి కాగానే ఇంటి నుంచి బయటికి వచ్చేసి సొంతంగా బతుకుతున్నానని అతను ఈ సందర్భంగా గుర్తు చేశాడు. పరోక్షంగా తనకు కుటుంబంతో సంబంధాలు లేవన్నట్లు అతను చెబుతున్నట్లు కనిపిస్తోంది.
తమ్ముడి పేరెత్తకుండానే అతడి కంటెంట్ తీవ్ర అభ్యంతరకరమన్నట్లు అతను మాట్లాడాడు. కాగా అజయ్ పెళ్లికి ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరైన వీడియోలను కొందరు వైరల్ చేస్తూ.. ప్రణీత్ వ్యవహారంతో ముడిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ అజయ్ వీడియోలను పరిశీలిస్తే.. అతడిదంతా క్లీన్ రికార్డ్ అని అర్థమవుతుంది. హనుమంతుకు కూడా ఐఏఎస్ అధికారిగా మంచి పేరుంది. ఆ కోణంలో చంద్రబాబు అజయ్ పెళ్లికి హాజరై ఉండొచ్చు. అంతమాత్రాన ఇప్పుడు ప్రణీత్ చేసిన పనికి, చంద్రబాబుకు ముడిపెట్టి విమర్శలు చేయడం కరెక్ట్ కాదు.