ఎవరెన్ని చెప్పినా.. ఎంత తెలివిగా ప్లాన్ చేసినా తప్పు తప్పే. ఒకసారి నేరం చేసిన తర్వాత తప్పించుకోవటం సాధ్యం కాదు. ఏదో రకంగా అడ్డంగా బుక్ కావటం ఖాయం. ఈ చిన్న లాజిక్ ను చాలామంది మిస్ అవుతూ జైలుపాలు అవుతుంటారు. ఆర్థిక ఇబ్బందులు.. అవసరాలు తప్పుడు పనులు చేసేలా ప్రోత్సహించే వేళలో.. దారి తప్పకుండా కష్టపడటం ద్వారా కాస్త నెమ్మదిగా అయినా సమస్యల్ని అధిగమించొచ్చు. అందుకు భిన్నంగా పేరాశతో తప్పు దారిలోకి వెళితే మాత్రం అందుకు మూల్యం చెల్లించాల్సి వస్తుంది. తాజాగా వెలుగు చూసిన ఉదంతమే దీనికి పెద్ద ఉదాహరణ. దొంగనోట్లను ముద్రించే అంశంపై ఒక ప్రముఖ ఓటీటీలోని ఒక వెబ్ సిరీస్ ను 150 సార్లు చూసిన ఇద్దరు.. అందులో మాదిరి దొంగనోట్లను ప్రింటింగ్ చేయాలని ప్లాన్ చేశారు.
అందుకు తగ్గట్లే దొంగనోట్లను ప్రింట్ చేస్తూ చలామణి చేస్తున్నారు. అనూహ్య పరిస్థితుల్లో తాజాగా వారు పోలీసులకు చిక్కారు. ఈ క్రమంలో వారి నుంచి అందిన సమాచారం విన్న పోలీసులు విస్మయానికి గురయ్యే పరిస్థితి. మిత్రుడి సాయంతో దొంగ నోట్లను చలామణి చేస్తున్న వీరు అల్లాపూర్ పోలీసులకు చిక్కారు. అసలేం జరిగిందంటే..
వరంగల్ జిల్లాకు చెందిన 37 ఏళ్ల లక్ష్మీనారాయణ కొన్నేళ్ల క్రితం సిటీలోని బోడుప్పల్ కు వచ్చి స్థిరపడ్డాడు. రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్న అతను.. గతంలో మూడు కేసుల్లో నిందితుడు. అతనికి సొంత జిల్లాకు చెందిన ఒక ప్రైవేటు ఉద్యోగి ప్రణయ్ స్నేహితుడు. ఇటీవల కాలంలో లక్ష్మీనారాయణ ఆర్థిక పరిస్థితి బాగా దెబ్బ తింది. దీంతో దొంగనోట్ల తయారీకి సిద్ధమయ్యాడు. పక్కాగా ప్లాన్ చేసేందుకు వీలుగా ఓటీటీలో అందుబాటులో ఉన్న ఒక వెబ్ సిరీస్ ను 150 సార్లు చూశారు. రెండు నెలల్లో అన్నిసార్లు ఆ వెబ్ సిరీస్ ను చూసిన వారు.. దొంగనోట్ల ప్రింటింగ్ కు అవసరమైన సామాగ్రిని కొనుగోలు చేశారు.
తొలి బ్యాచ్ గా రూ.3లక్షలు విలువైన నోట్లను ప్రింట్ చేశారు. ఒక ఒరిజినల్ నోటుకు మూడు దొంగనోట్లు బదులు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. తొలి ప్రయత్నం సక్సెస్ కావటంతో రెండో విడతలో రూ.4.05 లక్షల దొంగనోట్లను ప్రింట్ చేశారు. బాలానగర్ ఎస్ వోటీ.. అల్లాపూర్ పోలీసులు శనివారం ఉదయం తనిఖీలు చేయగా వీరు అనుమానాస్పద రీతిలో తారసపడ్డారు. వీరిని సోదా చేయగా.. వీరి వద్ద 810 నోట్లు కనిపించాయి.
వాటిని పరిశీలించగా అనుమానం వచ్చింది. దీంతో వారిని తమదైన రీతిలో విచారించగా మొత్తం గుట్టు రట్టైంది. వెంటనే లక్ష్మీనారాయణ ఇంటికి వెళ్లి ప్రింటర్.. ల్యాప్ టాప్.. ప్రింటింగ్ సామాన్లను స్వాధీనం చేసుకున్నారు. దొంగనోట్ల ప్రింటింగ్ వ్యవహారం బయటకు రాకుండా ఉండేందుకు ఇంట్లోనే ఒక గదిని వాడేవాడు. అందులోని ఇంట్లోని వారిని సైతం అస్సలు అనుమతించేవాడు కాదని తేలింది. పక్కాగా ప్లాన్ చేసిన వారి స్కెచ్ పోలీసులకు సైతం విస్మయానికి గురి చేసింది.