స్నేహంలో ద్రోహం…మోసం వంటి వాటికి పాల్పడితే అంతకు మించిన దుర్మార్గం మరొకటి ఉండదు. అలాంటి పనే చేసినోడు.. తన జీవితాన్నే బలి చేసుకున్న వైనం కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. స్నేహితుడ్ని మోసం చేయటం ఒక ఎత్తు అయితే.. మరో అమ్మాయి జీవితాన్నినాశనం చేయాలని అనుకున్నాడు. ఇంతా చేసి స్నేహితుడి చేతిలోనే హత్యకు గురయ్యాడు. కర్నూలు మండలానికి చెందిన దినేశ్ డిగ్రీ చదువుతున్నాడు.
అతడికి మురళీక్రిష్ణ అనే స్నేహితుడు ఉన్నాడు. అతను పెళ్లిళ్లు.. శుభకార్యాలకు డెకరేషన్లు చేస్తుంటాడు. వయసులోతన కంటే కాస్త పెద్దవాడైనప్పటికీ దినేశ్ అతన్ని అభిమానించేవాడు. దినేశ్ కు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఆమెకు సంబంధించిన ప్రైవేటు వీడియోల్ని తనతో ఉంచుకున్నాడు. ఆ వీడియోల గురించి మురళీ క్రిష్ణకు తెలిసింది. ఒకసారి దినేశ్ కు తెలీకుండా అతని ఫోన్ లోని ఆ వీడియోల్ని.. తన ఫోన్లోకి ట్రాన్స్ ఫర్ చేసుకున్నాడు.
అనంతరం ఆ యువతికి ఫోన్ చేసి వేధింపులకు గురి చేశాడు. ఆ వీడియోల్ని ఆమె కుటుంబ సభ్యులకు షేర్ చేస్తానని.. బంధువులకు పంపుతానని బెదిరించేవాడు. తన కోరిక తీర్చమని వేధించేవాడు. అతడి వేధింపులకు తాళ లేని ఆమె.. ఎవరికి చెప్పుకోలేక ఇటీవల ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించింది. ఇంట్లోని వారు గుర్తించటంతో ఆసుపత్రిలో చేర్చటంతో ప్రాణాపాయం తప్పింది.
ఈ సందర్భంగా ఆమె ఆత్మహత్యాయత్నానికి కారణం ఏమిటన్న విషయం దినేశ్ కు తెలిసింది. మిత్రుడి ద్రోహానికి వేదన చెందిన అతడు.. ఎట్టి పరిస్థితుల్లో అతన్ని చంపాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా మర్డర్ ప్లాన్ చేసిన దినేశ్ కు మరో స్నేహితుడు తోడయ్యాడు. శివమాల ధరించిన మురళీక్రిష్ణను జనవరి 25న బైక్ మీద ఎక్కించుకొని వెళ్లి నగర శివారులోని పంచలింగాల ప్రాంతానికి తీసుకెళ్లి.. అక్కడ కత్తితోపొడిచి చంపేశారు.
అనంతరం డెడ్ బాడీని నన్నూరు టోల్ ప్లాజా సమీపంలోని హెచ్ఎన్ఎస్ఎస్ కాల్వలో పడేసి ఏమీ తెలీనట్లుగా వెళ్లిపోయారు. కాల్వలో పడేయటానికి ముందు.. మురళీక్రిష్ణ దుస్తుల్ని.. సెల్ ఫోన్ ను వేర్వేరు చోట్ల పడేసి.. తమను ఎవరూ పట్టుకోరన్న ధీమాతో వెళ్లిపోయారు. ఇదిలా ఉంటే.. ఉన్నట్లుండి తన కుమారుడు కనిపించకపోవటంతో మురళీక్రిష్ణ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
విచారణలో భాగంగా దినేశ్ ను పోలీసులు విచారించారు. అతను చెప్పిన సమాధానాలతో డౌట్ వచ్చిన పోలీసులు మరింత లోతుగా విచారించారు. దీంతో.. తాను చేసిన పనిని చెప్పాడు. దీంతో.. మురళీక్రిష్ణ డెడ్ బాడీ కోసం హంద్రీనీవా కాల్వలో వెతుకుతున్నారు. ఇప్పటివరకు డెడ్ బాడీ గుర్తించలేకపోయారు. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది.