కడపలోని యోగి వేమన యూనివర్సిటీలో వేమన విగ్రహం తొలగింపు వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. వేమన విగ్రహాన్ని తొలగించి అక్కడ వైఎస్ఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో రాజకీయ దుమారం రేగింది. అయితే, అభివృద్ధి పనులలో భాగంగానే విగ్రహాన్ని యూనివర్సిటీ ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేశామని యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ సూర్య కళావతి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.
మెయిన్ గేటు వద్ద వేమన విగ్రహం ఉంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. కొత్త అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగుకు ఈ యూనివర్సిటీ వ్యవస్థాపకుడు వైఎస్ఆర్ పేరు పెట్టడంతో అక్కడ వైఎస్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందనుకున్నామని చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారం పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. విద్య లేనివాడు విద్వాంసు చేరువ… అనే వేమన శతకం ట్వీట్ చేసి పవన్ కళ్యాణ్ విమర్శలు గుప్పించారు.
ఇక, ఈ వ్యవహారంపై టిడిపి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు కూడా స్పందించారు. ప్రజావేదిక కూల్చివేతతో జగన్ పాలన మొదలైందని, అది కొత్త పుంతలు తొక్కుతూ ఇలా పరాకాష్టకు చేరిందని విమర్శించారు. తాజాగా, వేమన స్థానంలో రాజశేఖర్ రెడ్డి విగ్రహం ప్రతిష్టించడం జగన్ రెడ్డి దిగజారుడుతనానికి నిదర్శనమని విమర్శించారు. వేమనకంటే వైయస్ గొప్పవాడని చెప్పాలనుకుంటున్నారా అంటూ మండిపడ్డారు. భవిష్యత్తులో గురజాడ, శ్రీశ్రీ, వీరబ్రహ్మేంద్ర స్వామి లాంటి వారి విగ్రహాలను జగన్ తొలగించినా ఆశ్చర్యపడనవసరం లేదని విమర్శించారు. జగన్ రెడ్డి పిచ్చి చేష్టలకు ప్రజలు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు.