రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పే పనులు కొన్ని బీజేపీ ఇప్పటి నుంచే చేస్తుంది. ఎన్నడూ లేనిది మంత్రులు, మాజీ మంత్రుల వ్యాఖ్యలకు ఎప్పటికప్పుడు కౌంటర్ దాఖలు చేస్తోంది. ఆ విధంగా బీజేపీ దుందుడుకుగా పోతోంది. ఎలా అయినా వచ్చే ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా పనిచేసేందుకు కొన్ని సక్సెస్ ఫార్ములాలు ముందున ఉంచుకుని పనిచేసేందుకు సిద్ధం అవుతోంది.
ఈ క్రమంలో యూపీ తరహా పాలిటిక్స్ ఏపీలోనూ చేసేందుకు సిద్ధం అవుతోంది. ఎలా అయినా జగన్ కు మరోసారి అధికారం దక్కనివ్వకూడదన్న వ్యూహంతోనే తాము పనిచేయనున్నామని బీజేపీ అధినాయకత్వం చెప్పకనే చెబుతోంది.
ఈ నేపథ్యాన యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ , బీజేపీ జాతీయ కార్యదర్శి వై.సత్యకుమార్ ఆంధ్రాపాలిటిక్స్ పై దృష్టిసారించారు అన్న వార్తలు వస్తున్నాయి. 2020 సెప్టెంబర్లో జాతీయ కార్యదర్శిగా నియమితులయిన ఆయన ఇకపై ఆంధ్రాలో కూడా పనిచేయనున్నారు. ఈ మేరకు ఆంధ్రా ఎన్నికల్లో ఆయనే వ్యూహకర్త. ఓ విధంగా ప్రశాంత్ కిశోర్ కు పోటీగా ఆయన తనదైన స్ట్రాటజీని నడపనున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్ పాలనపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
అసమర్థ పాలన అందిస్తున్న, అస్తవ్యస్త పాలన అందిస్తున్న జగన్-ను రాష్ట్రంలో బీజేపీయే తొలగించి, రాష్ట్రాన్ని నడిపించే రోజులు రానున్నాయి అని అన్నారాయ న. పనితీరు బాలేని కారణంగా మంత్రి వర్గం నుంచి తప్పించిన పేర్నినాని బీజేపీపై వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. అసలు పనితీరే ప్రామాణికం అనుకుంటే ముందుగా జగనే తనని తాను తప్పించుకోవాల్సి ఉంటుందని అన్నారు.
ఇంకా ఆయనేం అన్నారంటే..
కేంద్రం ఆదుకోకపోతే పూటగడవని పరిస్థితి ఏపీలో ఉన్న మాట నిజం కాదా అని నిలదీశారు. ఈ మేరకు ఢిల్లీలో ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఇకపై ఏపీ బీజేపీ వ్యవహారాలను మరింత వేగం చేసేందుకు సత్యకుమార్ కంకణం కట్టుకున్నారా అన్న విధంగానే ఈ స్టేట్మెంట్ ఉంది.
ఇప్పటికే ఏపీ అప్పులపై బీజేపీ ప్రచారం చేస్తున్న దృష్ట్యా దానిని వేగవంతం చేసేందుకు సత్య కుమార్ కూడా తనవంతు సాయం చేయనున్నారు. మంత్రులకు ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇస్తే కాస్తయినా పార్టీ వాయిస్ ప్రజల్లోకి ముఖ్యంగా మీడియాలోకి పోతుందన్నది ఆయన ఒపీనియన్.