తెలంగాణలో రాజకీయ పార్టీని ఎత్తేసి కాంగ్రెస్ పార్టీలో కలిపేసి ఏపీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల ఆంధ్రాలో తన అన్న జగన్ కంట్లో నలుసులా మారారు. రాజకీయంగా, వ్యక్తిగతంగా తీవ్ర విమర్శలు చేస్తున్న షర్మిల బుధవారం నవ సందేహాల పేరుతో జగన్ కు 9 ప్రశ్నలు సంధించింది. ఇక అదే బాటలో గురువారం మరో 9 ప్రశ్నలతో లేఖ విడుదల చేసింది.
కడప పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ తరపున ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగిన షర్మిల ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో అన్న జగన్ మీద విమర్శనాస్త్రాలకు పదును పెడుతుంది. తెలంగాణలో చివరి నిమిషంలో ఎన్నికల్లో పోటీ చేయకుండా తప్పుకున్న షర్మిల ఆంధ్రాలో తన గెలుపుకన్నా అన్న జగన్ ఓటమి లక్ష్యంగా పనిచేస్తున్నట్లుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
నవ సందేహాల పేరుతో రెండో లేఖ విడుదల చేసిన షర్మిల తన లేఖలో పేర్కొన్న అంశాలు ఇవి.
1.25 మంది ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా తెస్తామని అన్నారు. మీరు చేసిందేమిటి?
2. 2.30 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న మీ హామీ ఏమయింది?
3. ప్రతి ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు. ఎందుకు ఇవ్వలేదు?
4. నిరుద్యోగులు 7.7 శాతం పెరగడం మీ ప్రభుత్వ వైఫల్యం కాదా?
5. 23 వేలతో మెగా డీఎస్సీ అన్నారు. 6 వేలతో దగా డీఎస్సీ ఎందుకు వేశారు?
6. యూనివర్శిటీల్లో ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులు ఎందుకు భర్తీ చేయలేదు?
7. గ్రూప్-2 కింద ఒక్క ఉద్యోగం కూడా ఎందుకు భర్తీ చేయలేదు?
8. యువత ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు ఎందుకు వెళ్తున్నారు?
9. జాబు రావాలంటే మీ పాలన పోవాలి అని అంగీకరిస్తారా?