ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నాడు. ఈ ప్రమాణ స్వీకారానికి ప్రధాని నరేంద్రమోడీ, హోంమంత్రి అమిత్ షా, ఆరోగ్యమంత్రి, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, రామ్మోహన్ నాయుడు, జితిన్ రామ్ మాంఝీ, కిషన్ రెడ్డి, చిరాగ్ పాశ్వాన్, సహాయమంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, బండి సంజయ్, జయంత్ చౌదరి, భూపతిరాజు శ్రీనివాస్ వర్మతోె పాటు విశిష్ట అతిథిగా మెగాస్టార్ చిరంజీవి కూడా పాల్గొననున్నాడు.
అయితే ఈ ప్రమాణస్వీకారానికి వీరందరికన్నా ఈ అధికారం అందించిన కొందరు వీవీఐపీలకు చంద్రబాబు నాయుడు నుండి ఆహ్వానం అందింది. వారెవరో తెలుసా వైసీపీ ఆగడాలకు అడ్డుగా నిలబడి, ధైర్యంగా ఎదురొడ్డిన నికార్సయిన టీడీపీ కార్యకర్తలు కావడం విశేషం. ఓ సామాన్య కార్యకర్తతో పాటు గత ప్రభుత్వంలో దాడులకు గురైన 104 మంది బాధిత కుటుంబాలకు ప్రమాణ స్వీకారానికి రావాలని చంద్రబాబు నాయుడు ప్రత్యేక ఆహ్వానం పంపారు.
తన ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా పుంగనూరు టీడీపీ కార్యకర్త అంజిరెడ్డికి, అబ్దుల్ సలాం, డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబాలను ఆహ్వానించారు. అంజిరెడ్డి తాత గతంలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాడు. చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం మార్లపల్లె గ్రామానికి చెందిన అయ్యమ్మగారి అంజిరెడ్డి టీడీపీ కార్యకర్త. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో అప్పటి అధికార పార్టీ బెదిరింపులకు భయపడకుండా నామినేషన్ వేసేందుకు ప్రయత్నించగా కొందరు ఆయనను అడ్డుకున్నారు.
ఆ సమయంలో 70 ఏళ్ల వయసులో అంజిరెడ్డి తాత వారిని ఎదిరించి ఎన్నికలు జరపాలంటూ మీసం మెలేసి, తొడకొట్టి ప్రత్యర్థులకు సవాల్ విసిరడం విశేషం. ప్రస్తుత ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన తెలుగుదేశం పార్టీ తమ పార్టీ కార్యకర్తలు, అభిమానులను గుర్తుపెట్టుకుని మరీ ప్రమాణ స్వీకారానికి పిలవడం ఆ కుటుంబాలలో సంతోషాన్ని నింపింది.