నెల్లూరు జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం ఉదయగిరిలో గత మూడు సార్లుగా విజయం దక్కించుకుం టున్న మేకపాటి చంద్రశేఖరరెడ్డిని వైసీపీ అధిష్టానం పార్టీ నుంచి సస్సెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే.. ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో వైసీపీకి ఇంచార్జ్ లేకుండా పోయారు. సస్పెండ్ అయిన చంద్రశేఖరరెడ్డి టీడీపీలో చేరేందుకు రెడీ అవుతున్నారు. ఆయన స్థానిక వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా వైసీపీ అధిష్టానం సంచలన నిర్ణయం తీసుకుంది. ఉదయగిరి వైసీపీ ఇంచార్జ్‌గా మేకపాటి కుటుంబానికే చెందిన రాజగోపాల్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. ఈయన ప్రస్తుత ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డికి రెండో అన్నయ్య. పెద్దన్న మేకపాటి రాజమోహన్‌రెడ్డి. వీరు ముగ్గురు అన్నదమ్ములు. అయితే.. వీరిలో రెండో వ్యక్తి రాజగోపాల్‌రెడ్డికే ఈ పగ్గాలు అప్పగించడంతో ఉదయగిరిలో తమ్ముడిపై(చంద్రశేఖర్) అన్న(రాజగోపాల్)కు రాజకీయ వేదిక రెడీ చేసినట్టు అయింది.
మేకపాటి రాజగోపాల్‌రెడ్డి డిగ్రీ పూర్తి చేశారు. నలభై ఏళ్లుగా కేఎంసీ కన్స్ట్రక్షన్స్లో కాంట్రాక్టర్‌గా ఉంటూ బెంగళూరులో నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం ఆయన కుమారులిద్దరికీ కాంట్రాక్టు బాధ్యతలు అప్పగించారు. 1983లో మేకపాటి రాజమోహన్‌రెడ్డి రాజకీయ ప్రవేశం చేసిన నాటి నుంచి ఆయన ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతిసారీ ఆర్థికంగా రాజగోపాల్‌రెడ్డి సాయం చేస్తున్నారనే ప్రచారం ఉంది. ఇటీవల నెల్లూరు జిల్లా ఆత్మకూరులో జరిగిన ఉప ఎన్నికలోనూ ఈయన కీలకపాత్ర పోషించారు.