వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఆయన సోదరి షర్మిలకు మధ్య నడుస్తున్న ఆస్తుల పంచాయితీకి సంబంధించి రోజుకో అప్డేట్ అన్నట్లుగా పరిస్థితి మారింది. నిన్నటికినిన్న తాజా పరిణామాలపై విజయమ్మ లేఖ రాయటం.. అందులో కూతురికి ఇవ్వాల్సిన ఆస్తి విషయంలో ఆమె తన స్టాండ్ ను ప్రస్తావించటంతో పాటు.. జగన్ ఏం చేయాలన్న విషయాన్ని సూటిగా చెప్పేశారు. తనకు ఇద్దరు పిల్లలు సమానమన్న ఆమె.. ముందుగా చేసుకున్న ఒప్పందాన్ని గౌరవించాలన్న అభిప్రాయాన్ని చెప్పేశారు.
విజయమ్మ లేఖకు సమాధానంగా తాజాగా వైసీపీ నుంచి బహిరంగ లేఖ విడుదలైంది. గతంలో షర్మిలకు కౌంటర్ ఇచ్చేందుకు వైవీ సుబ్బారెడ్డి.. విజయసాయి రెడ్డి.. పేర్ని నాని.. అంబటి రాంబాబు తదితరులు బయటకురాగా.. విజయమ్మ లేఖపై మాత్రం పార్టీ తరఫున లేఖ బయటకు విడుదల కావటం ఆసక్తికరంగా మారింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లిగా విజయమ్మను అమితంగా గౌరవిస్తామని.. ఆమె విడుదల చేసిన లేఖ నేపథ్యంలో కొన్ని అంశాల్ని ఆమె ముందుకు.. ప్రజల ముందుకు తీసుకొస్తున్నట్లుగా పేర్కొన్నారు. నాలుగు పేజీల లేఖలో పేర్కొన్న ముఖ్యంశాల్ని చూస్తే..
– జగన్ ను న్యాయపరంగా ఇబ్బంది పెట్టేందుకు.. బెయిల్ రద్దుకు జరిగిన కుట్ర వ్యవహారాన్ని కనీసం ప్రస్తావించకపోవటం ప్రజలను పక్కదోవ పట్టించడమే. సరస్వతీ కంపెనీ విషయంలో ఈడీ అటాచ్ మెంట్ ఉన్నప్పటికీ.. తెలంగాణ హైకోర్టు స్టేటస్ కో ఆదేశాలు ఉన్నాయి.
– యాజమాన్య బదిలీ జరిగేలా క్రయవిక్రయాలు చేయకూడదని.. అందుకే అటాచ్ మెంట్లో ఉందనే విషయం అందరికి తెలిసినప్పటికీ.. సరస్వతీ విషయంలో ఎలాంటి మార్పులు.. చేరపులు చేయొద్దని సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జిల సహా న్యాయ సలహాలు ఉన్నప్పటికీ.. తప్పు అని తెలిసినా.. మోసపూరితంగా.. కుట్రపూరితంగా షేర్లు బదిలీ చేసిన మాట వాస్తవమే కదా?
– షర్మిల భావోద్వేగాలకు.. ఒత్తిళ్లకు గురై జగన్ కు న్యాయపరంగా.. చట్టపరంగా చిక్కులు తెచ్చే ఈ పనికి.. తెలిసి కూడా విజయమ్మ ఆమోదించి సంతకం పెట్టటం నిజమే కదా? విజయమ్మ లేఖలో ఆ అంశాన్ని పూర్తిగా విస్మరించటం ప్రజలను.. వైఎస్ అభిమానులను పక్కదోవ పట్టించటమే కదా?
– 2024 ఎన్నికల్లో జగన్ ఒక్కరే ఒకవైపు.. అటువైపు చంద్రబాబు నాయకత్వంలో రాజకీయ ప్రత్యర్థులు జట్టు కడితే.. మరికొన్ని గంటల్లో ఎన్నికల ప్రచారం ముగిసే వేళలో.. వైఎస్ పేరును ఎఫ్ఐఆర్ లో పెట్టి.. తన కొడుకును అన్యాయంగా 16 నెలలు జైల్లో పెట్టిన కాంగ్రెస్ కు ఓటు వేయాలని విజయమ్మ చెప్పారు. ఆమె విడుదల చేసిన వీడియోతో ఆమె షర్మిల వైపు ఉన్నారనే విషయాన్ని స్పష్టంగా చెప్పారు.
– వైఎస్ రాజకీయ ప్రత్యర్థులకు.. వైఎస్ కుటుంబంపై నిరంతరం కుట్రలు పన్నేచంద్రబాబుకు రాజకీయంగా మేలు చేసే ఇలా వ్యవహరించటం ధర్మమేనా?
– రాజకీయాలు పక్కన పెడితే ఒక తల్లిగా ఆ రోజు విజయమ్మ మద్దతు సంగతి దేవుడెరుగు.. కనీసం తటస్థవైఖరిని మర్చిపోయి.. పక్షపాతం వహించిన తీరుకు వైఎస్ అభిమానులు తీవ్రంగా కలత చెందారు.
– షర్మిల భావోద్వేగాలు.. ఒత్తిళ్ల ప్రభావంతో.. సరస్వతీ కంపెనీ వ్యవహారంలో న్యాయపరంగా ఇబ్బందులు వచ్చి.. స్వయంగా తన కుమారుడి బెయిల్ రద్దు కుట్రకు దారి తీస్తుందని తెలిసి కూడా మోసపూరితంగా.. షేర్ల సర్టిఫికేట్లు పోయాయని చెప్పి.. ఒరిజనల్ షేర్ సర్టిఫికేట్ లేకుండా జగన్ సంతకం లేకుండా ఎవరికీ తెలీకుండా షేర్లను బదిలీ చేసి.. షర్మిలతోనే విజయమ్మ ఉన్నారని మరోసారి స్పష్టంగా చెప్పారు.
– జగన్ కు షర్మిల వ్యక్తిగతంగా రాసిన లేఖ టీడీపీ సోషల్ మీడియా అకౌంట్ లో ప్రత్యక్షం కావటం.. విజయమ్మ సంతకం చేసిన ఉత్తరాన్ని టీడీపీ వారు విడుదల చేయటం.. జగన్ పై షర్మిల చేసిన అనుచిత వ్యాఖ్యలు చేసినా విజయమ్మ సరిదిద్దలేదు. తన చెల్లెల్ని ఉద్దేశించి ఒక్క మాట మాట్లాడలేదు.
– షర్మిల వేసిన ప్రతి అడుగు ప్రత్యర్థులకు లబ్థి చేకూరేలా ఉన్నా.. మూడు నాలుగేళ్లుగా ఇంత జరుగుతున్నా ఒపికతో.. సహనంతో.. మౌనంగా ఆ బాధను జగన్ అనుభవించారు. ఇలాంటి పరిస్థితుల్లో అసలు బాధితులు ఎవరు?
– ఒక తల్లిగా విజయమ్మ బాసట ఎవరికి ఉండాలి? అన్న బలమైన ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. రాజకీయాల పేరుతో తెలంగాణలో అడుగు పెట్టిన దగ్గర నుంచి అవకాశం వచ్చినప్పుడుల్లా జగన్ ను షర్మిల ఇబ్బంది పెడుతూనే ఉంది.
– ప్రజాస్వామ్య విమర్శల పరిధి దాటి.. ఆజన్మాంత శత్రువుగా జగన్ ను షఱ్మిల అనరాని మాటలుఅన్నారు. ఎన్నికల వేళలో జగన్ పై దాడి జరిగితే ఎగతాళి చేసి.. అమానవీయంగా మాట్లాడింది షర్మిల కాదా? వీటన్నింటిని జగన్ ఓపికగా భరించారు.మరి రచ్చకెక్కింది ఎవరు? పరువు తీసింది ఎవరు? నిజమైన బాధితులు ఎవరు? జగన్ బాధితులు కాదంటారా?