ఏపీ అధికార పార్టీ వైసీపీ మాస్టర్ ప్లాన్ వేసిందా? ప్రతిపక్ష పార్టీలను బురిడీ కొట్టించేందుకు.. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. తాజాగా 75 మంది అభ్యర్థులతో వైసీపీ ఒక జాబితా విడుదల చేసిందంటూ.. సోషల్ మీడియాలో ఒక జాబితా వైరల్ అవుతోంది. అయితే.. ఇది నమ్మశక్యంగా లేదని అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. చాలా మందిని ఇప్పటికే వైసీపీ బ్లాక్ లిస్టులో పెట్టింది.
వారికి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చేది లేదని కూడా స్పస్టం చేసింది. కానీ, తాజాగా విడుదల చేసిన ఒక జాబితాలో మాత్రం కొందరు వారసులకు, కొందరు కొత్తముఖాలకు కూడా చోటు కల్పిస్తున్నట్టు పేర్కొంది. అదేసమయంలో నియోజకవర్గంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న వారికి కూడా అవకాశం కల్పించడం.. ఇప్పుడున్న సిట్టింగు ఎమ్మెల్యేలనే కొనసాగిస్తున్నట్టు పేర్కొనడం వంటివి నమ్మ శక్యంగా లేదని పరిశీలకులు చెబుతున్నారు.
ప్రధానంగా గాజువాక వంటి నియోజకవర్గం నుంచి తిరిగి పవన్ కళ్యాణ్ పోటీ చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఆచి తూచి నిర్ణయం తీసుకోవాలి. కానీ, సిట్టింగ్ ఎమ్మెల్యే తనయుడు తిప్పల రేవంత్ రెడ్డికి ఈ సీటు ఇస్తున్నట్టు జాబితాలో పేర్కొన్నారు. కానీ, వాస్తవానికి ఇక్కడ ఇంకా ఎలాంటి నిర్నయం తీసుకోలేదు. అదేవిధంగా సత్తెనపల్లి నియోజకవర్గంలో మంత్రి అంబటికి స్థాన చలనం ఖాయమని ఇప్పటికే పార్టీ అధిష్టానం క్లూ ఇచ్చింది.
కానీ, తాజా జాబితాలో ఆయన పేరు కూడా ఉంది. ఇక, చీరాలకు చెందిన ఆమంచి కృష్ణమోహన్‌కు పరుచూరు నియోజకవర్గాన్ని ఖరారు చేస్తున్నట్టు పేర్కొన్నారు. కానీ, వాస్తవం ఏంటంటే.. ఆయన ఇప్పటి వరకు ఈ నియోజకవర్గం జోలికి కూడా వెళ్లలేదు. వచ్చే ఎన్నికల నాటికి పార్టీ తనను కరుణిస్తుందని ఎదురు చూస్తున్నారు. అప్పటికీ మార్పు లేకపోతే.. సంచలన నిర్ణయం తీసుకునే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు. మొత్తంగా చూస్తే.. తాజా జాబితా అంటూ.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పేర్లలో సగానికైగానే.. ఫేక్ అని అంటున్నారుపరిశీలకులు. ఇదంతా కూడా ప్రతిపక్షాలను దారి మళ్లించేందుకేనని చెబుతున్నారు.