ఔను! ఇదే మాట ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. ఇటీవల ఆస్తివ్యవహారాలు వెలుగు చూసినప్పుడు.. తన బెయిల్ రద్దుచేయించే కుట్ర చేస్తున్నారంటూ.. సొంత తల్లి, చెల్లిపై.. వైసీపీ నేతల తో జగన్ వ్యాఖ్యలు చేయించారు. మాజీ మంత్రి పేర్ని నాని, వైసీపీ కీలక నాయకుడు వి. విజయసాయి రెడ్డి వంటివారు బాహాటంగానే ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. బెయిల్ రద్దు చేయించి.. పార్టీని సర్వనాశ నం చేయాలని కంకణం కట్టుకున్నట్టుగా షర్మిలమ్మ వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు.
దీంతో ఇది నిజమేనా? అనేది రాజకీయ వర్గాల్లోనూ చర్చగా మారింది. బెయిల్ రద్దయి.. జగన్ జైలుకు వెళ్తే.. పార్టీ ఉంటుందా? ఉండదా? అనేది ఆసక్తిగా మారింది. దీనివెనుక మరోకోణం కూడా ఉంది. వైసీపీలో ఉన్న వైఎస్ సానుభూతిపరులను తన చెంతకు తెచ్చుకునేందుకు షర్మిల ఈ ఎత్తుగడ వేస్తున్నారన్నది కూడా వైసీపీనాయకులు చెబుతున్న మాట. అయితే..దీనివెనుక నిజం ఉందో లేదో తెలియదు కానీ.. వీరు చేస్తున్న ఆలోచనపై మాత్రం చర్చ సాగుతోంది.
ప్రాంతీయ పార్టీల్లో అనేక మంది జైళ్లకు వెళ్లారు. అంత మాత్రాన పార్టీలు కనుమరుగైన పరిస్థితి లేదు. గతంలో తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న జయలలిత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా జైలు బాటపట్టారు. కరుణానిధి సమయంలోనూ ఆమె జైల్లో ఉన్నారు. అంత మాత్రాన అన్నాడీఎంకే తుడిచి పెట్టుకుపోలేదు. ఇక, చంద్రబాబు 53 రోజుల పాటు జైల్లో ఉన్నారు. ఆయన పార్టీ అంత మైపోతుందని వైసీపీ అనుకున్నా.. జరగలేదు.
అయితే.. దీనికి భిన్నంగా వైసీపీలో జరుగుతుందని అంటున్నారు. వైఎస్ వారసురాలిగా షర్మిల తనను తాను ప్రొజెక్టు చేసుకునేందుకు మరింత అవకాశం దొరుకుతుందని.. కాబట్టి వైఎస్ సానుభూతి పరులు ఆమెవైపు మొగ్గు చూపుతారని అంటున్నారు. అందుకే.. వెంటనే జగన్ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారని అంటున్నారు. అంటే..జగన్ మనసులో కూడా షర్మిల అంటే.. బెరకు ఉందన్నది వాస్తవం. కానీ, ఆమె ఆ రేంజ్ పాలిటిక్స్ చేస్తే.. మాత్రం ఈ భయాలు నిజమయ్యే అవకాశం లేదు. అప్పటి వరకు వైసీపీకి ఇబ్బంది లేదు. కాబట్టి.. వైసీపీ ఉనికి అనేది షర్మిల వ్యవహరించే తీరుపైనే ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.