నంద్యాల జిల్లా బనగానపల్లెలో టీడీపీ అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి అర్ధాంగి ఇందిరమ్మపై వైసీపీ కార్యకర్తలు రాళ్ల దాడి చేసిన అమానుష ఘటన రాష్ట్రవ్యాప్తంగా పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. మహిళ అని కూడా చూడకుండా వైసీపీ కార్యకర్తలు గూండాలలా వ్యవహరించిన వైనంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ దాడి ఘటననను టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఖండించారు. ఇందిరమ్మపై వైసీపీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డి కుమారుడు ఓబుల్ రెడ్డి తన అనుచరులతో దాడి చేయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని లోకేశ్ ఫైర్ అయ్యారు.
ఐదేళ్లుగా జనాలను కాటు వేసిన కాటసాని రామిరెడ్డి కుటుంబం ఇప్పుడు ఓటమి భయంతో మహిళలపై కూడా దాడులకు పాల్పడడం దారుణమని లోకేశ్ మండిపడ్డారు. వైసీపీ సర్కారుకు, అరాచకాలకు మే 13న ఎక్స్ పైరీ డేట్ ఫిక్స్ అయిందని కాటసానిని హెచ్చరించారు.
ఇక, ఇందిరమ్మపై దాడి ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో ఉన్న ఇందిరమ్మపై వైసీపీ నేత కాటసాని రామిరెడ్డి కొడుకు ఓబుల్ రెడ్డి దాడికి పాల్పడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. తల్లి వయసున్న మహిళలపై రాళ్లు, కర్రలతో దాడి చేసిన ఈ సంస్కారహీనులను, రౌడీలను మళ్లీ గెలిపించాలా? అని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఓటమి భయంతో వైసీపీ సైకోలు రాక్షసుల్లా తయారవుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. మరో వారం రోజుల్లో జగన్ రెడ్డి అరాచకాలకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.