ఏపీలో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకున్న నేపథ్యంలో సీఎం జగన్, వైసీపీ నేతలపై టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల 11 మంది సిట్టింగ్లకు జగన్ స్థానచలనం కల్పించిన నేపథ్యంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ‘‘11 మందిని కాదు…150 మందిని మార్చిన నువ్వు గెలవలేవు జగన్’’ అంటూ చంద్రబాబు చేసిన కామెంట్లు ఏపీలో రాజకీయ కాక రేపుతున్నాయి.
ఓటమి భయంతోనే జగన్ హడావుడి చేస్తున్నారని, ఒక చోట చెల్లని కాసు మరో చోట చెల్లుతుందా? అని చంద్రబాబు ప్రశ్నించారు. అయినా, బడుగు వర్గాలనే ఎందుకు మారుస్తున్నారని నిలదీశారు. వైసీపీ మునిగే ఓడ అని, దూకేందుకు చాలా మంది రెడీగా ఉన్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. జగన్ కు కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి బినామీ అని, ఆయనది అంతులేని దోపిడీ అని విమర్శించారు. ఆయనను ఎందుకు మార్చలేదని ప్రశ్నించారు. బాలినేనికి సీటు ఇవ్వబోమని, మారుస్తామని జగన్ చెప్పారా? అని ప్రశ్నించారు. అధికారుల బదిలీల మాదిరి వైసీపీలోని బడుగు వర్గాల నేతలకు రాజకీయ బదిలీలు జగన్ చేస్తున్నారని దుయ్యబట్టారు.
ఇక, మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుందని, ఆ వెంటనే ఒక్కొక్కరు అడ్రస్ లేకుండా పోతారని వైసీపీ నేతలనుద్దేశించి చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. పులివెందుల సీటును బీసీలకు కేటాయించే దమ్ము జగన్ కు ఉందా అని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రభుత్వంపై ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఉందని, మార్చినాటికి అది తార స్థాయికి చేరుతుందని అన్నారు. 2024 ఎన్నికల్లో కొందరు వైసీపీ నేతలకు డిపాజిట్లు కూడా గల్లంతవుతాయని చంద్రబాబు జోస్యం చెప్పారు. పొరపాటున జగన్ ను ఎన్నుకున్నామని ప్రజలు మౌనంగా భరిస్తున్నారని, అటువంటి వారిని వేధించడం దుర్మార్గం, నీచం అని చంద్రబాబు దుయ్యబట్టారు.
ప్రజలకు ధర్మకర్తలా వ్యవహరించాల్సిన జగన్ నియంతలా మారి ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. రాబోయే ఎన్నికలు టిడిపికో, జనసేనకో, 2 పార్టీలకో సంబంధించినవి కావని, ఆంధ్ర రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు సంబంధించినవని అన్నారు. అందుకే, రాబోయే ఎన్నికల్లో ప్రజలు వైసీపీని ఓడించాల్సిన అవసరం ఉందని ప్రజలకు పిలుపునిచ్చారు. 2024 ఎన్నికలలో తెలుగుజాతి, రాష్ట్ర ప్రజలు గెలవాలన్నారు.