ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. తొలి రోజు సభకు వైసీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే జగన్ కూడా హాజరయ్యారు. గవర్నర్ ప్రసంగానికి పదే పదే అడ్డు తగిలిన వైసీపీ సభ్యులు..ఆ తర్వాత సభ నుంచి వాకౌట్ చేశారు. అయితే, తమకు ప్రతిపక్ష హోదా కావాలని డిమాండ్ చేసిన వైసీపీ సభ్యులు ఈ ఒక్కరోజుకే వాకౌట్ చేశారా..లేక ఈ సెషన్ మొత్తం వాకౌట్ చేశారా అన్న సందేహం ఏర్పడింది. ఈ క్రమంలోనే ఈ అనుమానాన్ని పటా పంచలు చేస్తూ ఈ సెషన్ మొత్తం సమావేశాలకు హాజరు కావడం లేదని జగన్ ప్రకటించారు.
అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిన తర్వాత వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ అయిన జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ బడ్జెట్ సమావేశాలకు హాజరుకాకూడదని ఆయన నిర్ణయించారు. వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చే ఆలోచన ప్రభుత్వానికి లేదని జగన్ అన్నారు. అసెంబ్లీకి వెళ్లినా వెళ్లకపోయినా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని జగన్ చెప్పారు. ప్రజల్లో ఉంటూ ప్రజల కోసం పోరాటం సాగిద్దామని అన్నారు.
ఇక, 30 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉంటానని వైసీపీ నేతలతో జగన్ అన్నారట. అంతేకాదు, 2028 ఫిబ్రవరిలో జమిలి ఎన్నికలు వచ్చే అవకాశముందని, ఇప్పటి నుంచే ఎన్నికలకు సిద్ధం కావాలని తమ పార్టీ నేతలకు జగన్ పిలుపునిచ్చారట. ఒకవేళ పేదలకు వైసీపీ ఇచ్చిన ఇళ్ల స్థలాలు ఈ ప్రభుత్వం వెనక్కి తీసుకుంటే బాధిత ప్రజలకు అండగా ఉండాలని నేతలకు జగన్ సూచించారట.
జగన్ తాజా నిర్ణయంపై విమర్శలు వస్తున్నాయి. కేవలం అనర్హత వేటు పడుతుందన్న ఉద్దేశ్యంతోనే ఈ రోజు జగన్ సభకు వచ్చి అటెండెన్స్ వేసి వెళ్లారని మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే సోమిరెడ్డి ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలపై పోరాడతానని బిల్డప్ ఇచ్చిన జగన్…ఇలా ఒక్క రోజు సభకు వచ్చి హాజరు వేసి వెళ్లిపోవడంపై టీడీపీ నేతలు ట్రోల్ చేస్తున్నారు.