జనసేనాని వస్తే ఏమౌతుంది ? ఇదే ప్రశ్న ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో వినిపిస్తుంది. ఇప్పటికే పలు చోట్ల కౌలు రైతు కుటుంబాలకు భరోసా ఇచ్చి వారికో ఆత్మ విశ్వాసం అందించి వెళ్లిన జనసేనాని త్వరలో అంటే మరో రెండు మూడు రోజుల్లో సీమ ప్రాంతాలలో పర్యటించనున్నారు. ఆ విధంగా ఆయన మరోసారి వారి బాధలు, కష్టాలు, ఇబ్బందులు అన్నవి నేరుగా తెలుసుకునే ప్రయత్నం ఒకటి చేయనున్నారు.
ఈ నేపథ్యాన ఆయన టూర్ షెడ్యూల్ కూడా ఖరారయింది. ఇప్పటికే తూగో, పగో, అనంత పురం దారుల్లో ప్రయాణించి ప్రజల కష్టాలు, అదేవిధంగా కౌలు రైతుల ఇక్కట్లు తెలుసుకుని వచ్చారు.ఆయనకు సవాలుగా నిలిచిన ప్రత్యర్థి వర్గాలను ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఆయన మరోసారి జగన్ ను టార్గెట్ చేసేందుకు సిద్ధం కానున్నారు.
జగన్ సొంత ఇలాకా కడపలోనే ఈ నెల 19 న ఆయన పర్యటించి, బాధిత కుటుంబాలకు ఆర్థికంగా చేయూత ఇచ్చి వారిలో ఆత్మ విశ్వాసం నింపి రానున్నారు. ఈ పర్యటన తరువాత మరుసటి రోజు అంటే ఆగస్టు 20న తిరుపతి పర్యటనకు ఆయన సిద్ధం అవుతున్నారు. ఈరెండు పర్యటనలూ ఆయనకెంతో కీలకం కానున్నాయి. ఓ విధంగా వచ్చే ఎన్నికల్లో ఆయన తిరుపతి కేంద్రంగా పోటీచేయనున్నారు అన్న వార్తలూ వచ్చాయి.
అవి ఎలా ఉన్నా తిరుపతి కేంద్రం గా ఉన్న జనసేన ఎప్పటి నుంచో ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నది. ముఖ్యంగా ఇక్కడ టీడీపీ (తారక్ అభిమాన వర్గం)కి, జనసేనకూ మంచి అనుబంధ బాంధవ్యాల న్నవి ఉన్నాయి. వాటిని దృష్టిలో ఉంచుకునే పవన్ పర్యటన సాగనుంది. ఓ విధంగా చెప్పాలంటే ఇక్కడ పనిచేస్తున్న బీజేపీ కార్యకర్తల కూడా పవన్ అంటే కాస్తో కూస్తో సానుభూతితోనే ఉంటారు.
కనుక ఈ సారి ఆయన పర్యటన మరింత ఆసక్తిని రేపుతోంది. పొత్తుల విషయమై పవన్ కల్యాణ్ ఏం మాట్లాడుతారో అన్నది ఆసక్తిదాయకం. ఎందుకంటే అదే తిరుపతి కేంద్రంగా గతంలో చంద్రబాబు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.వాటిని దృష్టిలో ఉంచుకుని పొత్తుల విషయమై ఏదో ఒక స్పష్టతతో కూడిన ప్రకటన అన్నది ఆయన నుంచి వస్తుందని అంతా భావిస్తున్నారు.