ప్రచార పిచ్చి ఎక్కువైతే ఒక్కోసారి అసలుకే మోసం వస్తుంది. ఈ విషయం ఇప్పుడు వైసీపీ మంత్రి అంబటి రాంబాబుకు బాగా తెలిసొచ్చిందనే చెప్పాలి. సత్తెనపల్లి నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్న అంబటి రాంబాబు చేసిన ఓ పని ఇప్పుడు వైసీపీని చెత్తకుప్పల పాలు చేసింది. ప్రచారంలో హోరెత్తిస్తున్న రాంబాబు డిఫరెంట్గా ఆలోచించి ఓ ఐడియా వేశారు. జనాలు ఎక్కువగా టీ కొట్ల దగ్గర చాయ్ తాగుతూ ఉంటారు కదా. వాళ్ల చేతుల్లో జగన్తో పాటు తన ఫోటొ ఉండాలని రాంబాబు అనుకున్నారు. అందుకే లేటు చేయకుండా పేపర్ టీ కప్పులపై జగన్, తన ఫొటో.. వైసీపీ పేరు ముద్రించి పంచేశారు. రోడ్డు పక్కన ఉన్న టీ కొట్లన్నింటీకి ఇచ్చేశారు.
ప్రచారంలో మంచి ఐడియాతో ఈ పని చేశామని అంబటి రాంబాబు అనుకున్నారు. కానీ ఇప్పుడు జగన్, రాంబాబు ఫొటోలు సత్తెనపల్లి చెత్తకుప్పల్లో దర్శనమిస్తున్నాయి. టీ తాగిన తర్వాత ఆ కప్పులు చెత్తలోనే కదా పడేసింది. ఇలా చెత్త బుట్టలు, చెత్త కుప్పల్లో ఇప్పుడు వైసీపీ కనిపిస్తోంది. దీంతో వీటిని చూసి అందరూ నవ్వుకుంటున్నారు. సరైన ప్లేస్కు ఇవి చేరాయంటూ సెటైర్లు వేస్తున్నారు. టీ కప్పులు పంచామని భుజాలు చరుచుకున్న అంబటి రాంబాబు ఇలాంటి పరిణామాన్ని ఊహించలేకపోయారని విశ్లేషకులు చెబుతున్నారు.
టీ తాగిన తర్వాత ఆ పేపర్ కప్పులను ఎవరూ దాచి పెట్టుకోవాలని అనుకోరు. ఎక్కడైనా సరే పడేస్తారు. ఇప్పుడవన్నీ చెత్తకుప్పల్లో చేరుతున్నాయి. అంబటి రాంబాబు చేసిన పని ఇప్పుడు టీడీపీ కూటమికి ఆయుధంగా మారింది. వైసీపీ ఎక్కడికి చేరాలో అక్కడికే చేరిందంటూ విమర్శలు చేస్తున్నారు. మరోవైపు ఇలా కప్పులు పంచడం నిబంధనల ఉల్లంఘనే అంటూ ఈసీకి టీడీపీ నేతలు ఫిర్యాదు కూడా చేయబోతున్నారు. ఇప్పటికే టీ కప్పుల వల్ల డ్యామేజీ జరిగింది. ఇక ఈసీ కేసు కూడా పెడితే అంతే సంగతి.