ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు భద్రత విషయంలో మరోసారి లోపాలు వెలుగు చూశాయి. జడ్ + కేటగిరీభద్రత ఉన్నచంద్రబాబుకు.. ఆమేరకు భద్రత కల్పించడంలోనూ.. ఆయన కు అందుతున్న భద్రతను సమీక్షించడంలోనూ ఏపీ ప్రభుత్వం విఫలమైందన్న వాదన వినిపిస్తోంది. ఇప్పటికే ఉమ్మడి కృష్ణాలోని నందిగామ, ప్రకాశం జిల్లా, గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో చంద్రబాబుపై రాళ్ల దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన భద్రతా సిబ్బందికి గాయాలు కూడా అయ్యాయి.
ఇక, ఇప్పుడు పశ్చిమ గోదావరి పర్యటనలో ఉంగుటూరు వద్ద చంద్రబాబు కాన్వాయ్‌లోకి వైసీపీకి చెందిన వాహనాలు దూసుకొచ్చాయి. వైసీపీ వాహనాలు వచ్చినప్పటికీ.. రాష్ట్ర పోలీస్ ఎస్కార్ట్ సిబ్బంది వాహనాలు చోద్యం చూస్తూ ఉండిపోయాయి. రెండు వైసీపీ వాహనాలు ఉంగుటూరు నుంచి తాడేపల్లిగూడెం వరకు చంద్రాబాబు కాన్వాయ్‌ని అనుసరించాయి. కాన్వాయ్‌లోకి చొచ్చుకు వచ్చిన వాహనాలను నియంత్రించకుండా ఎస్కార్ట్ పోలీసులు వదిలేయడం మరింత వివాదానికి దారితీసింది.
ఏం జరిగింది?
అకాల వర్షాలకు దెబ్బతిన్న రైతుల తరఫున ప్రభుత్వంపై పోరుబాటకు చంద్రబాబు రెడీ అయిన విషయం తెలిసిందే. ఇప్పటికే తూర్పులో గత రెండు రోజుల కిందట ఆయన పర్యటించారు. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో రైతులతో కలిసి భారీ నిరసన కు రెడీ అయ్యారు. ఇది శుక్రవారం చేపట్టనున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు పశ్చిమ గోదావరికి బయలు దేరారు.
ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లోకి వైసీపీకి చెందిన వ్యక్తుల రెండు వాహనాలు చొచ్చుకు వచ్చి అనుసరించాయి. ఆ రెండు వాహనాలను అధికారులు నియంత్రించకపోవడం, పోలీసులు కూడా మిన్నకుండడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని టీడీపీ నాయకులు చెబుతున్నారు. మరి దీనిపై ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.