బీజేపీతో పొత్తులో భాగంగా టికెట్లు కోల్పోయిన టీడీపీ, జనసేన నేతలపై వైసీపీ కన్నేసింది. వారిని పార్టీలో చేర్చుకునేందుకు విశ్వప్రయత్నాలు చేసింది. అయితే పదవుల ఎర, ప్రలోభాలతో అధికారపక్షం చేపట్టిన ‘ఆపరేషన్ ఆకర్ష్’ నీరుగారిపోయింది. చెప్పుకోదగిన నేతలెవరినీ పార్టీలోకి తీసుకురాలేకపోయింది. పొత్తులో సీట్లు పోవడం వల్ల టీడీపీ, జనసేన నేతల్లో పెద్దఎత్తున కల్లోలం చెలరేగుతుందని.. వారందరినీ తమ వైపు లాక్కోవాలని ప్రభుత్వ పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, ఎంపీలు విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి మిధున్‌రెడ్డి పథకం సిద్ధం చేశారు.
ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన ప్రతి జిల్లాలో ఇద్దరు-ముగ్గురు సీనియర్ నేతలకు ఈ బాధ్యత అప్పగించారు. తాడేపల్లి కార్యాలయం నుంచి ప్రతి రోజూ వారిని పరుగులు పెట్టించారు. జనసేనకు కేటాయించిన సీట్లలో టీడీపీ నేతలు, టీడీపీకి ఇచ్చిన సీట్లలో జనసేన నాయకులు తీవ్ర అసంతృప్తికి గురవడం ఖాయమని, వారిని వలవేసి పట్టి.. తమ పార్టీలోకి తెచ్చుకుంటే విపక్ష కూటమిని దెబ్బ తీయొచ్చని వైసీపీ నాయకత్వం ఆశించింది. ఇందులో భాగంగా విజయనగరం జిల్లా నెల్లిమర్లలో టీడీపీ ఇన్చార్జి బంగార్రాజుతో సుబ్బారెడ్డి మంతనాలు జరిపారు.
ఎమ్మెల్సీ ఖాయంగా ఇప్పిస్తామన్నారు. కుదరకపోతే ఏదైనా కార్పొరేషన్‌ను చైర్మన్‌ను చేస్తామని చెప్పారు. ఆ సీటు జనసేనకు వెళ్లడంతో బంగార్రాజు తీవ్ర అసంతృప్తితో ఉన్న మాట నిజం. అక్కడ ఆయన బలమైన అభ్యర్థిగా ఉన్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ సమీప బంధువు వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నా.. బంగార్రాజు పోటీచేస్తే ఓటమి ఖాయమని ఐప్యాక్ సర్వేల్లో తేలింది. దీనివల్లే ఆయన్ను దారికి తెచ్చుకోవడానికి వైసీపీ నాయకులు ప్రయత్నించారు. అయితే చంద్రబాబు నేరుగా మాట్లాడి ఇతరత్రా అవకాశాలిస్తానని హామీ ఇవ్వడంతో బంగార్రాజు సంతృప్తి చెందారు. పార్టీ మారేందుకు ససేమిరా అన్నారు.
అలాగే పెందుర్తి కూడా జనసేనకు వెళ్లింది. ఇక్కడ మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఏనాటి నుంచో టీడీపీకి పెద్దదిక్కుగా ఉన్నారు. వయోభారం కారణంగా తనకు టికెట్ ఇవ్వలేకపోతే తన కుమారుడు అప్పల్నాయుడికి ఇవ్వాలని కోరారు. తన అల్లుడు కూడా అయిన శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్నాయుడి ద్వారా కూడా ప్రయత్నాలు సాగించారు. అయితే అది పొత్తులో జనసేనకు వెళ్లింది. వెంటనే విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి రంగంలోకి దిగారు. వైసీపీలోకి వస్తే అసెంబ్లీ టికెట్ ఇస్తామని, జగన్‌ను కలిసి పార్టీలో చేరాలని.. భవిష్యతలో మంత్రి పదవి కూడా రావచ్చని లీకులు పంపారు. దీనిపై ఆయన భగ్గుమన్నారు. తాను టీడీపీలో చంద్రబాబు కంటే సీనియర్‌ను అని.. పొత్తుల్లో కొందరికి సీట్లు పోవడం మామూలేనని.. అంతమాత్రాన తల్లిలాంటి పార్టీకి ద్రోహం చేస్తామనుకోవడం పొరపాటని తేల్చిచెప్పారు.
గోదావరిలో..
గోదావరి జిల్లాల్లో జనసేనకు ఎక్కువ సీట్లు ఇవ్వడంపై టీడీపీ నేతలు గుర్రుగా ఉన్నారు. టీడీపీకి సీట్లు ఖరారైన చోట్ల జనసేన నేతలు కూడా అసంతృప్తితో ఉన్నారు. వారితోనూ వైసీపీ నాయకత్వం చర్చించింది. రాజమండ్రి రూరల్ కోరుకున్న జనసేన సీనియర్ నేత కందుల దుర్గేశ్‌కు నిడదవోలు లభించింది. అయితే తమ పార్టీలో చేరితే రాజానగరం సీటిస్తామని మిథున్‌రెడ్డి రాయబారం సాగించారు. కొందరు కాపు సంక్షేమ సంఘాల నేతలను ఆయన వద్దకు పంపారు. అయితే తాను పవన్‌ను వదిలేది లేదని.. టికెట్ ఇచ్చిన తర్వాత పార్టీ ఎలా మారతానని దుర్గేశ్ ప్రశ్నించడంతో వారు వెనుదిరిగారు.
రాజోలు (ఎస్సీ) సీటు జనసేనకు వెళ్లడంతో అక్కడి టీడీపీ సీనియర్ నేతలను తమ పార్టీలోకి తీసుకోవాలని మిథున్‌రెడ్డి, సుబ్బారెడ్డి ప్రయత్నించారు. వారెవరూ ముందుకు రాలేదు. తాడేపల్లిగూడెం కూడా జనసేనకు వెళ్లడంతో ఆ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి వలవల బాబ్జీని వైసీపీవైపు లాగాలని మంత్రి కొట్టు సత్యనారాయణ విఫలయత్నం చేశారు. ఉండి టీడీపీ ఎమ్మెల్యే రామరాజుకే పార్టీ నాయకత్వం టికెట్ ఇచ్చింది. మాజీ ఎమ్మెల్యే శివరామరాజుకు ఇవ్వలేదు. దాంతో ఆయన వస్తే వైసీపీ టికెట్ ఇస్తామని వైసీపీ పెద్దలు ఆశచూపారు. వారిద్దరూ ససేమిరా అన్నారు.
టీడీపీ, జనసేన శ్రేణులు నో..
పొత్తును టీడీపీ, జనసేన శ్రేణులు పలుచోట్ల సమర్థిస్తున్నాయి. నేతలెవరైనా పక్కచూపులకు ప్రయత్నిస్తే అడ్డుకుంటున్నారు. ఉదాహరణకు.. కృష్ణా జిల్లాలో అవనిగడ్డ అసెంబ్లీ సీటు జనసేనకు వెళ్లింది. అక్కడ టీడీపీ ఇన్చార్జిగా మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ ఉన్నారు. ఆయన్ను వైసీపీలోకి తీసుకోవాలని మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని గట్టి ప్రయత్నం చేశారు. బుద్ధప్రసాద్ కూడా ఒక దశలో వారి ఒత్తిడికి లొంగి.. నియోజకవర్గ టీడీపీ నేతలతో సమావేశమయ్యారు. వారిలో అత్యధికులు.. పైగా ఆయన సన్నిహితులే తీవ్రంగా వ్యతిరేకించారు. దాంతో ఆయన ఆగిపోయారు. అంతకుముందు అక్కడ ఉన్న వైసీపీ సిటింగ్ ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్‌బాబును మచిలీపట్నం లోక్‌సభ ఇన్చార్జిగా ప్రకటించారు.
అయితే ఆయన పోటీకి విముఖంగా ఉండడం.. అవనిగడ్డకు సరైన అభ్యర్థి ఎవరూ దొరక్కపోవడంతో మళ్లీ ఆయన్నే అసెంబ్లీ స్థానం ఇన్చార్జిగా ప్రకటించారు. దివంగత నేత వంగవీటి రంగా తనయుడు రాధాకృష్ణను కూడా వైసీపీలోకి తీసుకోవాలని ప్రయత్నించారు. ఆయన కూడా స్పందించలేదు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం పొత్తులో జనసేనకు వెళ్లింది. ఆ స్థానాన్ని ఆశించిన టీడీపీ నాయకులు జలీల్ ఖాన్, నాగుల్ మీరా, బుద్ధా వెంకన్నలతో వైసీపీ నేతలు సంప్రదింపులు జరిపారు.
వీరిలో వెంకన్న సీఎం జగన్‌ను విమర్శించేవారిలో ముందు వరుసలో ఉంటారు. ఆయన్ను కూడా పార్టీలోకి తీసుకోవడానికి వైసీపీ పెద్దలు ప్రయత్నించడం చూసి.. ఆ నియోజకవర్గంలోని ఆ పార్టీ నేతలు కూడా ముక్కున వేలేసుకున్నారు. ఇదేం రాజకీయమని మండిపడ్డారు. రాయలసీమలోనూ కొన్ని చోట్ల ఇలాంటి ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. ముఖ్యంగా పెనుకొండ, కల్యాణదుర్గం, తంబళ్లపల్లె, చిత్తూరు. మదనపల్లె, శ్రీకాళహస్తి, రైల్వే కోడూరు, కమలాపురం, కడప టీడీపీ నేతలతో ఇప్పటికీ మంతనాలు సాగిస్తున్నారు.
బెంగళూరులో వ్యాపారాలు ఉన్నవారిని అక్కడ పట్టుకుంటున్నారు. తమతో చేతులు కలిపితే వారి వ్యాపారాలకు ఆటంకాలు ఉండవని… లేదంటే దాడులు తప్పవని కూడా హెచ్చరిస్తున్నారు. అయితే ఆ బెదిరింపులకు కాలం చెల్లింది. 2019 నుంచి వైసీపీ దాడులు, తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు, అణచివేతలకు జడిసి రాజకీయాలకు దూరంగా ఉంటున్న టీడీపీ శ్రేణులు, నేతలు గత ఏడాది కాలంగా పూర్తిస్థాయిలో క్రియాశీలమయ్యారు. చంద్రబాబును స్కిల్ కేసులో అక్రమంగా అరెస్టు చేశాక వారు కూడా తెగించారు. ఎదురుదాడులకు దిగేందుకు కూడా వెనుకాడడం లేదు. ఈ దఫా జగన్‌ను ఎలాగైనా ఓడించాలని కృతనిశ్చయంతో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు. టికెట్లు ముఖ్యం కాదని.. గెలుపే ప్రధానమన్న సంకల్పంతో చాలా నియోజకవర్గాల్లో నేతలంతా సమన్వయంతో వ్యవహరిస్తున్నారు. ఇది టీడీపీ నాయకత్వానికి పెద్ద ఊరటనిస్తోంది.
ఇండిపెండెంట్‌గా పోటీచేయండి..
వైసీపీ పెద్దలు మరో ఎత్తు కూడా వేశారు. టీడీపీ బలంగా ఉన్న చోట్ల టికెట్ రాని అసంతుష్ట నేతలెవరైనా ఉంటే.. స్వతంత్రంగా పోటీచేయాలని సూచిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోతే తమ గెలుపు సునాయాసమవుతుందని భావిస్తున్నారు. కొన్ని చోట్ల కొందరు టీడీపీ, జనసేన నేతలు తమకు సీటిస్తే వస్తామని వైసీపీ నేతలకు చెప్పారు. అలా అడిగిన నేతలు పోటీచేసే సత్తా ఉన్నవారు కాకపోవడం.. వారి కంటే తమ అభ్యర్థులే మెరుగైనవారని వైసీపీ నాయకత్వం భావించింది. అందుకే అలాంటి వారు స్వతంత్ర అభ్యర్థులుగా నిలబడాలని, కొంత ఆర్థిక సాయం చేస్తామని వైసీపీ పెద్దలు తాయిలాలు ఎరవేశారు. ఉదాహరణకు.. ఏలూరు జిల్లా నూజివీడు టీడీపీ మాజీ ఇన్చార్జి ముద్దరబోయిన వెంకటేశ్వరరావుకు ఆ పార్టీ టికెట్ రాలేదు. అక్కడ మాజీ మంత్రి కొలుసు పార్థసారథికి ఇచ్చారు.
దీంతో వైసీపీ నుంచి సీటు ఆఫర్ రాగానే ముద్దరబోయిన వైసీపీ నేతల వద్దకు వెళ్లి మాట్లాడి వచ్చారు. అక్కడ ఏ హామీ రాకముందే టీడీపీకి రాజీనామా చేశారు. నూజివీడు, గన్నవరం నియోజకవర్గాల్లో ఆయన పేరు పరిశీలిస్తున్నామని తొలుత చెప్పిన వైసీపీ నేతలు.. చివరకు సీటు ఇవ్వలేమని తేల్చేశారు. ఆయన ఎక్కడైనా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే సాయం చేస్తామని చెప్పారు. ఆయన బిత్తరపోయారు. అనంతపురం జిల్లాలో కనీసం నాలుగు నియోజకవర్గాల్లో టీడీపీలో టికెట్ల కోసం గట్టి పోటీ నెలకొంది. అక్కడ వారి ఇళ్ల చుట్టూ వైసీపీ నేతలు తిరుగుతున్నారు. ఇప్పటివరకూ అక్కడి టీడీపీ నేతలు ఆసక్తి చూపలేదు. వైసీపీ నేతల ప్రయత్నాలను టీడీపీ, జనసేన నాయకత్వాలు పసిగట్టేశాయి.
టికెట్లు దక్కని కొందరు నేతలతో పార్టీ అధినేత చంద్రబాబు, యువ నేత లోకేశ్ నేరుగా మాట్లాడి బుజ్జగిస్తున్నారు. ఇప్పుడు సీటు ఇవ్వలేకపోయినా.. అధికారంలోకి వచ్చాక అవకాశాలు ఇస్తామని సర్దిచెబుతున్నారు. మరి కొందరు నేతలను రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పార్టీ కేంద్ర కార్యాలయానికి పిలిపించి అనునయిస్తున్నారు. అటు జనసేన అసంతృప్త నేతలతో పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని.. అందుకే వైసీపీ నాయకులు ఎన్ని ఆకర్షణలు చూపించినా టీడీపీ, జనసేన నేతలు స్పందించడం లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుపుపై నమ్మకం లేకపోవడం వల్లే ఆ పార్టీలోకి వెళ్లడానికి ఆసక్తి చూపడం లేదని అంటున్నారు.