సీఎం జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాలుగున్నరేళ్లుగా ఇసుక, మద్యం, గంజాయి ద్వారా అడ్డగోలుగా జగన్ వేల కోట్లు దోచుకున్నారని లోకేష్ ఆరోపించారు. అందుకే, కుప్పం, మంగళగిరి నియోజకవర్గాలకు 300 కోట్లు చొప్పున దోపిడీ సొమ్మును పంపించారని సంచలన ఆరోపణలు చేశారు. ఈ రెండు నియోజకవర్గాల్లో ఒక్కో ఓటుకు 10 వేలు ఇచ్చి కొంటున్నారని ఆరోపించారు.
ఈ నేపద్యంలోని ఈ రెండు నియోజకవర్గాల ఓటర్లకు లోకేష్ సంచలన పిలుపునిచ్చారు. ఐదేళ్లుగా ఒక్కో ఓటర్ నుంచి లక్ష రూపాయలు జగన్ దోచుకున్నారని, ఇప్పుడు ఖర్చు చేస్తుంది పదోవంతేనని ఆరోపించారు. ఆ డబ్బు ప్రజలదే కాబట్టి తీసుకొని ఓటు మాత్రం ప్రజల కోసం శ్రమిస్తున్న కూటమి నేతలకు వేయాలని పిలుపునిచ్చారు. మంగళగిరికి కంపెనీలు వచ్చే అవకాశం లేదని ఆర్కే చెబుతున్నారని, కానీ తాను మంత్రిగా ఉన్నప్పుడు మంగళగిరి ఆటోనగర్ లో తెచ్చిన పైకేర్ అనే సాఫ్ట్వేర్ కంపెనీలో ఇప్పటికీ 580 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని గుర్తు చేశారు.
అధికారంతో పాటు అభివృద్ధి చేయాలన్న సంకల్పం ఉంటేనే ఇది సాధ్యమవుతుంది అన్నారు. కూటమి ప్రభుత్వం మరికొద్ది రోజుల్లో అధికారంలోకి రాబోతుందని, ఆ వెంటనే అమరావతి రాజధాని పనులు ప్రారంభించి యువతకు స్థానికంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని లోకేష్ హామీనిచ్చారు. ప్రతి ఏడాది జాబ్ నోటిఫికేషన్ తో ప్యూన్ నుంచి గ్రూప్ 1 వరకు ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామని లోకేష్ ప్రకటించారు.