రాజకీయాల్లో పైచేయి సాధించడమే లక్ష్యం.. ఏం చేస్తున్నామన్నది ప్రధానం కానేకాదు. ఇప్పుడు ఇదే సూత్రం వైసీపీకి వర్తిస్తోంది. ఎందుకంటే.. పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నిక జరుగుతున్న తిరుపతిలో వైసీపీ నేతలు మైండ్ గేమ్ ప్రారంభించారు. అది కూడా అదిరిపోయే రేంజ్లో మైండ్ గేమ్ ఆడుతున్నారు. సాధారణంగా ఎన్నికలు అనగానే మేం గెలుస్తామంటే.. మేం గెలుస్తామని ప్రచారం చేసుకోవడం సహజం. ఇది ఏ పార్టీ అయినా.. చేసే పనే. కానీ, దీనికి భిన్నంగా వైసీపీ నాయకులు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. వైసీపీ గెలుస్తుందని చేస్తున్న ప్రచారం కన్నా కూడా.. టీడీపీ ఓడిపోతుందని.. బీజేపీకి పరాభవం తప్పదని ప్రచారం దంచికొడుతున్నారు.
“పంచాయతీ.. మున్సి‘పోల్స్’ ఫలితాలే తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలోనూ పునరావృతం అవుతాయని నిర్ధారించుకున్న టీడీపీ, బీజేపీలు.. ఇప్పుడు ఆ పోరులో ద్వితీయ స్థానం కోసం పోటీపడుతున్నాయి. అందుకు శ్రేణులను సమాయత్తం చేసే పనిలో నిమగ్నమయ్యాయి“ అని వైసీపీ నాయకులు ప్రచారం చేస్తున్నారు. ఇది బాగానే వర్కవుట్ అవుతున్నట్టు బయట ప్రచారం చేస్తున్నారు. అంటే.. ఎన్నికలు కూడా జరగకుండానే టీడీపీని, బీజేపీని బద్నాం చేసే పని ప్రారంబించారు. ఇలా చేయడం ఎందుకు? అంటే…ఇప్పటి నుంచి ప్రజలను ఒక విధమైన ట్రాన్స్‌లోకి తీసుకువెళ్లడమే.
సాధారణంగా.. గెలిచే పార్టీవైపు జనాలు మొగ్గు చూపుతారు. ఓడిపోతారు.. అనుకుంటే మాత్రం ఒకింత వెనుకడుగు వేస్తారు. ఈ సూత్రాన్నే తమకు అనుకూలంగా మార్చుకున్న వైసీపీ నాయకులు… తిరుపతిలో టీడీపీ-బీజేపీలు వాటి మధ్య అవే పోరాడుతున్నాయని.. రెండో స్థానం కోసం కుస్తీలు పడుతున్నాయని ఓ తరహా డిజిటల్ ప్రచారం చేస్తున్నారు. వాట్సాప్‌లలోనూ, ఇన్స్ట్రాగ్రామ్లలోనూ ఇదే తరహా ప్రచారానికి తెరతీశారు. అయితే.. డిజిటల్ మీడియా ఎంతో ఉన్న టీడీపీ.. వైసీపీ ఆడుతున్న ఈ డిజిటల్ మైండ్ గేమ్‌కు చెక్ పెట్టే పనిచేయకపోవడం గమనార్హం. మరోవైపు బీజేపీ నేతలు సైతం దీనిపై ఇంకా దృష్టి సారించలేదు. దీంతో వైసీపీ చాపకింద నీరులా ఎలక్షన్ మైండ్ గేమ్‌కు తెరదీయడం గమనార్హం.