అవును.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అధికార వైసీపీ నాయకులను భయపెడుతున్నారు. యువ గళం పాదయాత్రతో దూకుడు ప్రదర్శిస్తున్న లోకేష్.. ఈ సారి మరింత ధైర్యంగా ముందుకు సాగుతున్నారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసే వాళ్ల పని చెబుతానంటూ వార్నింగ్ ఇస్తున్నారు. అంతే కాకుండా తప్పుడు ఆరోపణలు చేసిన వాళ్లపై మంగళగిరి అడిషనల్ మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టులో లోకేశ్ క్రిమినల్ కేసులు దాఖలు చేశారు. ఈ కేసులకు సంబంధించి న్యాయమూర్తి ఎదుట హాజరై వాంగ్మూలం ఇచ్చారు. ఇందుకోసం యువగళం పాదయాత్రకు లోకేష్ ఒక రోజు విరామమిచ్చారు.
యువగళం పేరుతో పాదయాత్ర చేస్తూ లోకేష్ రాష్ట్రాన్ని చుట్టేసే పనిలో ఉన్నారు. ఈ పాదయాత్రలో భాగంగానే అధికార వైసీపీకి కొమ్ము కాస్తూ.. టీడీపీ కార్యకర్తలపై కేసులు పెడుతున్న పోలీసులు, అధికారుల పేర్లను రెడ్‌బుక్‌లో నమోదు చేసుకుంటున్నానని లోకేష్ చెప్పిన సంగతి తెలిసిందే. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్లపై చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. మరోవైపు తనపై వస్తున్న ఆరోపణలనూ లోకేష్ దీటుగా ఎదుర్కొంటున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తప్పు చేస్తే తండ్రే తనను జైలుకు పంపిస్తాడని.. జగన్‌ను ఆయన తండ్రి కాపాడినట్లు కాపాడరని లోకేష్ సంచలన వ్యాఖ్యలే చేశారు. యువ గళం పాదయాత్రలో వైసీపీ ఎమ్మెల్యేల బండారాన్ని సాక్ష్యాలతో బయటపెడుతున్నామన్నారు. తనపై తప్పుడు ప్రచారం చేసే ఎవరినీ వదిలిపెట్టనని వార్నింగ్ ఇచ్చారు. అంతే కాకుండా తప్పుడు ఆరోపణలు, కట్టు కథలు రాసిన వాళ్లపై వరుసగా పరువు నష్టం దావాలు వేస్తున్నారు. ఇప్పటివరకూ అలాంటివి సివిల్, క్రిమినల్ కలిపి 8 కేసులు వేశారు. టీడీపీ కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న వాళ్లపై పోరాటం కొనసాగిస్తూనే ఉంటానని చెప్పారు. లోకేష్ మాటలను చూస్తుంటే ఆయన గేరు మార్చారనే విషయం స్పష్టమవుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు.