తాడికొండ ఎమ్మెల్యే, వైసీపీ బహిష్కృత నేత ఉండవల్లి శ్రీదేవి టిడిపిలో చేరబోతున్నారని చాలా కాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. వైసీపీలో తనకు ఘోర అవమానం జరిగిందని, తనపై అసత్య ఆరోపణలు చేసి వేటు వేశారని ఉండవల్లి శ్రీదేవి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. జగన్ పక్కన ఉండే కోటరీ ఆయనను తప్పుదోవ పట్టిస్తుందని ఆమె గతంలో ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడుతో ఉండవల్లి శ్రీదేవి దాదాపు గంటసేపు భేటీ అయ్యారు.
చంద్రబాబుతో శ్రీదేవి సమావేశం అయి పార్టీ మార్పుతో పాటు రాష్ట్రంలోని సమకాలీన రాజకీయాలపై చర్చలు జరిపినట్టుగా తెలుస్తోంది. చంద్రబాబుతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ శ్రీదేవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను కష్టాల్లో ఉండి ఇబ్బందులు పడుతున్న సమయంలో చంద్రబాబు, లోకేష్ తనకు అండగా నిలిచారని, మద్దతునిచ్చారని శ్రీదేవి అన్నారు. చంద్రబాబును తాను మర్యాదపూర్వకంగానే కలిశానని చెప్పారు. వైసిపి గూండాలు తనపై దాడి చేశారని, ఏపీలో దిశ చట్టం ఎక్కడ ఉందో చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రస్తుతం తాను తెలంగాణలో ఉంటున్నానని, ఏపీలో తన రక్షణ గురించి చంద్రబాబుతో మాట్లాడాలని అన్నారు. ఏ పార్టీలో చేరాలనే విషయంపై నాలుగైదు నెలలుగా ఆలోచిస్తున్నానని, త్వరలోనే ఏ పార్టీలో చేరబోతున్నానో ప్రకటిస్తానని చెప్పారు. చంద్రబాబు, జగన్ ల పాలనలో తేడాలను బేరీజు వేసుకున్నానని అన్నారు. ఎన్నికల కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని, ఆర్ 5 జోన్ లో ప్లాట్లు ఇవ్వద్దని హైకోర్టు చెప్పిందని గుర్తు చేశారు.
చంద్రబాబుతో భేటీ నేపథ్యంలో త్వరలోనే ఉండవల్లి శ్రీదేవి టీడీపీ తీర్థం పుచ్చుకుబోతున్నారని జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఉండవల్లి చేరిక దాదాపు ఖాయమని, అయితే, ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలి అన్న విషయంపై చంద్రబాబుతో ఆమె చర్చించారని తెలుస్తోంది. ఏది ఏమైనా, మరి కొద్ది రోజుల్లోనే అధికారికంగా చంద్రబాబు సమక్షంలో ఉండవల్లి సైకిల్ ఎక్కబోతున్నారని తెలుస్తోంది. ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి ఆమె బరిలో దిగే అవకాశముందని టాక్ వస్తోంది.