వైసీపీపై ఆ పార్టీ రెబల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో వైసీపీ దుర్మార్గ పాలనను అంతమొందించేందుకు అందరూ కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్లకు ఉన్న అధికారం ఎమ్మెల్యే, ఎంపీలకు లేదని చురకలంటించారు. ఈ విషయం చెప్పడానికి తాను బాధపడడంలేదని, నాలుగేళ్లలో అన్ని చూసే ఇప్పుడు పార్టీకి దూరంగా ఉంటున్నానని వెల్లడించారు.
రాష్ట్రాన్ని దోచుకోవడానికే ప్రథమ ప్రాధాన్యత అని, రాజ్యాంగబద్ధ సంస్థలన్నీ నిర్వీర్యం అయిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ నుంచి గ్రామపంచాయతీ సమావేశాల వరకు దేనికీ విలువ లేదని వాపోయారు. ప్రతి మంగళవారం రూ.3 వేల కోట్ల అప్పులు తెస్తున్నారని, అప్పు ఎంతవుతోందని నిలదీశారు. పోలవరం కట్టలేమని చేతులెత్తేశారని, పవర్ ప్రాజెక్టులు అమ్మేసే పరిస్థితికి వచ్చారని దుయ్యబట్టారు.
ప్రారంభానికి ముందే అమ్మకం టెండర్లు పిలిచే పాలన ఇదని, కృష్ణపట్నం థర్మల్ పవర్ ప్రాజెక్టు అందుకు ఉదాహరణ అని ఎద్దేవా చేశారు. ఏపీ ప్రజలను చూసి ఇతర రాష్ట్రాల వాళ్లు నవ్వుకుంటున్నారని అన్నారు. ఏపీలో ఒక లే అవుట్ వేసి ఒక ప్లాట్ అమ్మేవాడు కనిపించడంలేదని, తెలంగాణలో వ్యాపారాలు బాగున్నాయని చెప్పారు. అమరావతి కోసం వచ్చిన వ్యాపారులంతా గోడకు కొట్టిన బంతిలా తిరిగి వెళ్లిపోయారని చెప్పారు. హైదరాబద్ లో ఉన్న ఆంధ్రా ప్రజలు గతంలో కోడిపందాలకైనా ఏపీకి వచ్చేవారని, ఇప్పుడు రావడంలేదని ఆనం అన్నారు.