ప్రధాన పార్టీలకు ఆయువుగా నిలిచే కాదు కాదు ఆర్థిక బలాన్ని అందించే సత్తా విశాఖది. అదేవిధంగా ఎవరెవరో ఎక్కడెక్కడి వారో ఇక్కడికి వచ్చి రాజకీయం చేశారు. చేస్తున్నారు. ప్రాంతేతరులకు పట్టం కట్టిన విశాఖ పాపం! సొంత మనుషులకు ఊతం ఇవ్వలేకపోతోంది. సుబ్బిరామి రెడ్డి నుంచి సుబ్బారెడ్డి వరకూ పార్టీలు వేరయినా వీరంతా ప్రాంతేతరులు.
పురంధేశ్వరి నుంచి సాయిరెడ్డి వరకూ అంతా ప్రాంతేతరులే ! ఇప్పుడు ఎంపీ ఎంవీవీ కూడా ప్రాంతేతరుడే కావొచ్చు. అయినా ఆయనకు విశాఖ పై సర్వ హక్కులూ దఖలు పడ్డాయి. ఆయన ఫ్రెండు జీవీకి హయగ్రీవ కన్స్ట్రక్షన్ కంపెనీ ఒకటి ఉంది. అది కూడా ఇప్పుడు విశాఖలో శర వేగంగా రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్ బిజినెస్ లో దూసుకుపోతుంది. ఇది ఎంపీ అండదండలతోనే నడుస్తోంది. కొన్ని వివాదాలూ ఉన్నాయి. ఉన్నా కూడా మాట్లాడేవారే లేరు. అది వేరే విషయం.
ఇక స్థానికేతరులు గురించి మాట్లాడదాం.. నిన్నటి వరకూ ఉత్తరాంధ్ర రీజనల్ కో ఆర్డినేటర్ పేరిట సాయిరెడ్డి హవా ఇక్కడ చెల్లింది. ఇప్పుడు సాయిరెడ్డి ప్లేస్ లో వైవీ సుబ్బారెడ్డి వచ్చారు. పదవీ ప్రమాణం సింహాద్రి అప్పన్న సాక్షిగా చేశారు. ఇదంతా బాగుంది.. సుబ్బారెడ్డి ఎవరు.. ఎందుకని విశాఖ పై పట్టు తెచ్చుకోవాలని అనుకుంటున్నారు అంటే వచ్చే ఎన్నికల్లో ఆయనను ఇక్కడి నుంచే ఎంపీగా పోటీ చేయించాలని గతంలో పోయిన పరువు (విజయమ్మ ఇక్కడే పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు. 2014లో టీడీపీ హవాకు తలొగ్గి ఓడిపోయారు.. అంతేకాదు ఇంకొన్ని కారణాలు కూడా ఆ రోజు బలీయంగా ప్రభావితం చేశాయి. అది వేరే చర్చ) తిరిగి పొందాలన్నది జగన్ ఆలోచన.
అందుకే సాయిరెడ్డి ప్లేస్ లో సుబ్బారెడ్డి వచ్చారు. కానీ సాయిరెడ్డి హవా మాత్రం యథాతథంగా ఉంది. అదే ఇప్పుడు మరో కొట్లాటకు కారణం కావొచ్చు.. కాకపోనూ వచ్చు. ఆ ఇద్దరి మైత్రి కారణంగా ఏమయినా జరగవచ్చు.. ఏమో గుర్రం ఎగరా వచ్చు. ఏది ఏమైనా విశాఖలో ఈ నాన్ లోకల్ కేటగిరీలోని ‘విడిది‘ నేతల రాజకీయం స్థానిక ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.