ఆంధ్రప్రదేశ్‌లో మధ్యంతర ఎన్నికలేంటి.. వైసీపీ గెలవడం ఏంటి.. ఎవరు కడుతున్నారీ గాలి మేడలు అనిపిస్తోందా? వైఎస్సార్ కాంగ్రెస్ అగ్ర నేతల్లో ఒకరైన విజయసాయిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేసి అందరికీ షాకిచ్చారు. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్‌తో తన సంబంధం గురించి ఇటీవల వచ్చిన ఆరోపణలకు సమాధానం ఇస్తూ విజయసాయి ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టారు. ఆ టాపిక్ గురించి మాట్లాడుతూ తనను టార్గెట్ చేస్తున్న వారికి విజయసాయి వార్నింగ్‌లు ఇచ్చారు.
తాను ఎవరికీ భయపడే వ్యక్తిని కాదని.. ఇంతకుముందు కూడా ప్రతిపక్షంలో ఉన్నానని.. ఎప్పుడూ వెనక్కి తగ్గింది లేదని చెప్పిన విజయసాయి.. ఇప్పుడు వైసీపీ ఓడిపోయినా ఐదేళ్ల తర్వాత తిరిగి అధికారంలోకి వస్తుందని.. లేకుంటే మధ్యలోనే మధ్యంతర ఎన్నికలు వచ్చి విజయం సాధిస్తుందని.. అప్పుడు ఎవ్వరినీ వదిలిపెట్టేది లేదని.. తోక జాడించే వాళ్లందరినీ కట్ చేసి పారేస్తామని విజయసాయి హెచ్చరించారు.
ఐతే ఐదేళ్ల తర్వాత మళ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారం చేపడతాం అన్నంత వరకు ఓకే కానీ.. అవతల 161 సీట్లతో కూటమి అధికారంలోకి వచ్చింది, అందులో టీడీపీకి మాత్రమే 130కి పైగా సీట్లున్నాయనే విషయం మరిచిపోయి.. అక్కడేదో బొటాబొటి మెజారిటీ ప్రభుత్వం ఏర్పాటైనట్లుగా మధ్యంతర ఎన్నికల గురించి విజయసాయి మాట్లాడ్డమే విడ్డూరం. ఇదిలా ఉండగా తన వీరత్వం గురించి విజయసాయి చెబుతూ.. రామోజీ రావునే తాను ఏడిపించానని ఈ ప్రెస్ మీట్లో చెప్పుకున్నారు.
‘‘ఈ రోజు విపక్షంలో ఉన్నాడు వీడు ఏం చేస్తాడులే అని విజయసాయిరెడ్డిని తేలిగ్గా తీసుకోవచ్చు. కానీ విజయసాయిరెడ్డి ఒక్కసారి పట్టుబడితే ఆ రోజు రామోజీ రావు నాతో తగువేసుకున్నాడు. నేనే రోజూ రామోజీరావును కలవలా. ట్విట్టర్ ద్వారా నేను రామోజీ రావును ఎదిరించా. వేధించా. ఏం చేశాడు’’ అని విజయసాయి వ్యాఖ్యానించారు. ఐతే ట్విట్టర్లో తాను వేసే అబ్యూజివ్ ట్వీట్ల గురించి విజయసాయి ఇలా గొప్పలు పోవడం గురించి నెటిజన్లు నెగెటివ్‌గానే స్పందిస్తున్నారు.