ఏపీ సీఎం జగన్ కు తన పార్టీకే చెందిన ఎంపీ రఘురామకృష్ణరాజు పక్కలో బల్లెంలా…చెవిలో జోరీగాలా…చెప్పులో రాయిలా…కంటిలో నలుసులా…మారి ఇబ్బందిపెడుతోన్న సంగతి తెలిసిందే. తాను చెప్పేదంతా జగన్, పార్టీ మంచికేనంటూ రఘురామరాజు నొక్కే సన్నాయి నొక్కుల వల్ల వైసీపీ నేతల చెవులకు చిల్లులు పడుతున్నప్పటికీ…ఘాటుగా రఘురామకు జవాబివ్వలేని పరిస్థితి.
తనను విమర్శించిన వారికి గట్టిగా కౌంటర్ ఇవ్వడమో, వేరే వైసీపీ నేతలతో ఇప్పించడమో చేసే జగన్ కూడా రఘురామ విషయంలో మాత్రం ఘాటుగా ఏనాడూ స్పందించలేదు. దీంతో, స్వపక్షంలో విపక్షంలా మారిన రఘురామ…. సందర్భానుసారంగా ప్రతిపక్ష నేతలకంటే దారుణంగా జగన్ ను, వైసీపీ నేతలను ఇరకున పెట్టే వ్యాఖ్యలు చేస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా జగన్ పై రఘురామ మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
పోకిరి సినిమాలో ప్రకాష్ రాజ్ గిల్లితే గిల్లిచ్చుకోవాలి అన్న డైలాగ్ ను వాడేసిన రఘురామ….ఏపీలో జగన్ పరీక్షలు పెడితే వచ్చి రాయాలి..అంటూ సెటైర్ వేశారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ఏపీలో టెన్త్, ఇంటర్, డిగ్రీ పరీక్షలు నిర్వహించాలంటూ జగన్ తీసుకున్న నిర్ణయంపై రఘురామ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
కరోనా విలయతాండవం చేస్తున్న ఈ తరుణంలో పరీక్షలు పెట్టాలనుకోవడం సరికాదని రఘురామ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఎన్నికలే వద్దని బొప్పరాజు లాంటి నాయకులు రోడ్లమీదకు వచ్చారని, వారంతా ఇప్పుడేమయ్యారని ఆయన ప్రశ్నించారు. ప్రజలను చంపే హక్కు ప్రభుత్వానికి లేదని, దయచేసి…పరీక్షలు నిర్వహించాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు.
ఏపీలో కరోనా తీవ్రస్థాయిలో ఉందని, శ్మశానాల్లో కరోనా మరణాల సంఖ్య ఒకలా ఉంటే రిపోర్టుల్లో మరోలా ఉందని, అసలు మరణాల సంఖ్య బయటపెట్టాలని రఘురామ డిమాండ్ చేశారు. ”మీరు సలహాలు వినరూ.. ఇచ్చే ధైర్యం ఎవరికీ లేదు. ఎవరూ చెప్పనంత మాత్రాన… ప్రజలు నోరు మూసుకుని కూర్చుంటారా? నూరు గొడ్లను తిన్న రాబందు.. గాలి వానకు చావలేదా… తప్పుపై తప్పు చేసుకుంటూ దయచేసి వెళ్లొద్దు. ఇది నా చిరు సలహా. న్యాయమూర్తులను భయపెట్టడం మానేయ్యండి. మీ కేసులను త్వరగా తేల్చుకోండి’’ అని రఘురామ హితవు పలికారు.