తమిళ స్టార్ హీరో సూర్య నటించిన ‘జై భీమ్’ చిత్రం ఇటు ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలనూ అందుకుంటోన్న సంగతి తెలిసిందే. అణగారిన వర్గాలను న్యాయం అందించే లాయర్ చంద్రు పాత్రలో సూర్య అద్భుతంగా నటించాడని ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ సినిమా చూస్తే తన జీవితంలాగే అనిపించిందని, తనకూ న్యాయం చేసేందుకు చంద్రూ లాంటి ఒక లాయర్ రావాలని షాకింగ్ కామెంట్లు చేశారు.
ఈ సినిమాలో ఓ గిరిజన యువకుడ్ని లాకప్ లో పోలీసులు హింసిస్తుంటే గతంలో తనకు జరిగిన అనుభవాలే గుర్తొచ్చాయని ఆర్ఆర్ఆర్ అన్నారు. ఇది సినిమాలాగా అనిపించలేదని, తన జీవితమే అనిపించిందని చెప్పుకొచ్చారు. ఆ సినిమాలో గిరిజన యువకుడిని పక్కనబెడితే…తాను ఎంపీనని కానీ, తనకూ దిక్కులేదని వాపోయారు. తనను లాకప్ లో కొట్టిన విషయంపై సీబీఐ విచారణ కోరుతూ తన అబ్బాయి కోర్టును ఆశ్రయించినా… ఆర్నెల్లుగా దిక్కు లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సినిమా అందరూ చూడాలని, ఆ సినిమాలో మాదిరిగా చంద్రు వంటి లాయర్ వచ్చి తనకు న్యాయం చేస్తారేమోనని ఆర్ఆర్ఆర్ అన్నారు. ఈ సినిమా చూశాక టాలీవుడ్ నటుడు రావు రమేశ్ నుంచి హీరో సూర్య ఫోన్ నెంబర్ తీసుకుని మాట్లాడి తన స్పందన చెప్పానని అన్నారు. తన జీవితంపై కూడా ఓ సినిమా తీయాలని కోరానని, జై భీమ్-2 తీస్తారేమో చూడాలని అన్నారు. గతంలో తన దగ్గర సూర్య నంబర్ ఉందని, సూర్యతో పరిచయముందని, కానీ, తన ఫోన్ ను వేరేవారు తీసుకోవడం వల్ల నంబర్ పోయిందని పోలీసులనుద్దేశించి పరోక్షంగా కామెంట్లు చేశారు.