వైసీపీ అధినేత, సీఎం జగన్కు సొంత పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు భారీషాక్ ఇచ్చారు. జగన్పై నమోదైన 11 చార్జిషీట్లకు సంబంధించిన కేసుల్లో కోర్టులకు సీఎం జగన్ హాజరుకాకపోవడం సహా.. వాయిదాలపై వాయిదాలు పడుతుండడాన్ని ఆయన సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. గత సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా సీఎం జగన్ వ్యవహరిస్తున్నారని.. తన పిటిషన్లో రఘురామ పేర్కొన్నారు. తాజాగారఘురామ దాఖలు చేసిన ఈ పిటిషన్పై నవంబరు 3న(శుక్రవారం) సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరపనుంది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎన్వీఎస్ భట్టిలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ను విచారించనుంది.
రఘురామ పిటిషన్ ఏంటి?
ఎంపీ రఘురామ వేసిన పిటిషన్లో ఆసక్తికర విషయాలు ఉన్నాయి. స్వయంగా ఆయనే ఓ మీడియాసంస్థ డిబేట్లో పాల్గొని చెప్పిన వివరాల మేరకు.. దాదాపు 11 చార్జిషీట్లు సీఎం జగన్పై ఉన్నాయి. వీటిలో ఆయన బెయిల్ తెచ్చుకున్నారు. గత పదేళ్లుగా ఈ కేసులు ముందుకు సాగడం లేదు. మరీ ముఖ్యంగా గత ఐదేళ్లుగా ఈ కేసుల విచారణ కూడా మందకొడిగా సాగుతోంది. బెయిల్ ఇచ్చిన సమయంలో జగన్కు కోర్టులు అనేక కండిషన్లు పెట్టాయి. వీటిలో హైదరాబాద్ విడిచి వెళ్లరాదని, సాక్షులను ప్రభావితం చేయరాదని, బెదిరించరాదని ఉన్నాయి. అయితే.. వాటిని ఒక్కొక్కటిగా తొలగించుకుంటున్నారని.. విచారణ కూడా ఆలస్యమయ్యేలా వ్యవహరిస్తున్నారన్నది రఘువాదన వాదన.
అదేవిధంగా కేసుల విచారణకు సీఎం జగన్ హాజరు కావాల్సి ఉన్నప్పటికీ.. గత నాలుగేళ్లుగా ఆయన వెళ్లడం లేదని.. పిటిషన్లో రఘురామ పేర్కొన్నారు. ఇలా ఇప్పటి వరకు సెక్షన్ 8 ను అడ్డుపెట్టుకుని 371 నుంచి 380 సార్లు వాయిదా వేయించారని రఘురామ పిటిషన్లో వివరించారు. అయితే, రెండేళ్ల కిందట ఓ కేసులో ఓనిందితుడు 77 సార్లు వాయిదా కోరడంపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించి.. ఇన్ని సార్లు వాయిదా ఎలా కోరుతారని ప్రశ్నించిందని, అదే విషయం ఇప్పుడు సీఎం జగన్కు కూడా వర్తిస్తుందని.. అందుకే తాను పిటిషన్ వేసినట్టురఘురామ తెలిపారు.
ఇక, తెలంగాణ హైకోర్టులో సాగుతున్న సీఎం జగన్పై కేసుల విచారణను కూడా పక్క రాష్ట్రాలకు తరలించాని ఎంపీ రఘురామ తన పిటిషన్లో సుప్రీంకోర్టును కోరారు. పదేళ్లు గడిచినా..ఇప్పటి వరకు కేసుల విచారణ జరగకపోవడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ సీబీఐ కోర్టులో జగన్పై కేసుల విచారణ తీవ్ర జాప్యం జరుగుతోందని తెలిపారు. ఈ నేపథ్యంలో విచారణను వేరే రాష్ట్రానికి మార్చాలని రఘురామ విన్నవించారు. కాగా, ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు నవంబరు 3వ తేదీకి లిస్టు చేసింది.