వాస్తు దోషం ఉందని నమ్మితే.. తన ఇంటికే పరిమితమై.. పూజలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లో చేసుకోవడం అందరికీ తెలిసిందే. అయితే.. దీనికి భిన్నంగా వైసీపీకి చెందిన ఎంపీ ఒకరు తాను వేసిన రియల్ ఎస్టేట్ వెంచర్‌కు.. వాస్తు దోషం ఉందని తెలుసుకుని.. ఏకంగా.. దానికి కారణమైన రోడ్డును మూసేయించారు. ఇక, ఎంపీ సార్ చెప్పారనగానే.. మునిసిపల్, రెవెన్యూ అధికారులు వెంటనే సదరు రోడ్డుకు గడ్డర్లు పాతేశారు.
ఇది.. విశాఖపట్నం జిల్లాలోని టైకూన్‌లో జరిగింది. ఇక్కడి ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ రియల్ ఎస్టేట్ వ్యాపారి. అదేవిధంగా సినీ నిర్మాత కూడా. పైగా ఆయన హీరోగా ఇటీవల సీరియల్కూడా తీస్తున్నారు. ఇదిలావుంటే.. ఆయన నిర్మిస్తున్న రియల్ ఎస్టేట్ వెంచర్‌కు వాస్తుదోషం ఉందని ప్రజలు నడిచే దారిని మూసేయించారు. విశాఖలో టైకూన్ కూడలిని మూసేసి మరీ సదరు వెంచర్‌కు అధికారులు అనుమతి ఇచ్చారు.
ఇక, దీనిపై జనసేన తీవ్రస్థాయిలో యుద్ధం ప్రకటించింది. తాజాగా అక్కడ నిరసన వ్యక్తం చేసి.. పోలీసులకు ఫిర్యాదు కూడా చేశౄరు. అధికారులు ఎంపీకి సహకరించడం ఘోర తప్పిదమని పార్టీ నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. ప్రజా సమస్యపై శాంతియుతంగా నిరసన తెలుపుతున్న జనసేన నాయకులను పోలీసులు అడ్డగోలుగా రోడ్డుపై ఈడ్చుకెళ్లి అరెస్టు చేయడం పైశాచిక చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
విశాఖపట్నంలోని టైకూన్ జంక్షన్లో ఎంపీ నిర్మిస్తున్న వెంచర్ కి వాస్తు దోషం పేరిట అక్కడున్న ప్రధాన మార్గాన్ని మూసివేయడాన్ని తాము ఖండిస్తున్నామని నాదెండ్ల చెప్పారు. మరోవైపు ఈ విషయంపై నిరసన తెలిపిన పార్టీ వీర మహిళలను పోలీసులు అరెస్టు చేశారు. జనసేన నాయకులు, వీర మహిళల పట్ల పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని నాదెండ్ల వ్యాఖ్యానించారు. వీరి నిరసన ఎలా ఉన్నా.. ఎంపీ వాస్తు దోష వ్యవహారంపై మాత్రం సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.