దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డితోపాటు తెలంగాణ సీఎం కేసీఆర్ తనయురాలు, ఎమ్మెల్సీ కవితల పేర్లు ముందు నుంచి వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ కేసులో అనుమానం ఉన్న 36 మంది పేర్ల జాబితాలో తాజాగా ఈ ఇద్దరి పేర్లు కూడా ఈడీ నమోదు చేయడం సంచలనం రేపుతోంది. ఈ మద్యం కుంభకోణం నేపథ్యంలో మంగళవారం రాత్రి అరెస్ట్ చేసిన అమిత్ అరోడా రిమాండ్ రిపోర్టులో ఈడీ 36 మంది పేర్లు పేర్కొనడం సంచలనం రేపుతోంది.
ఆ పేర్లలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, విజయ సాయిరెడ్డి అల్లుడి సోదరుడు శరత్ చంద్రా రెడ్డి, గోరంట్ల బుచ్చిబాబు, బోయినపల్లి అభిషేక్, సృజన్రెడ్డిల పేర్లు వినిపించడం సంచలనం రేపుతోంది. దాదాపు రూ.100 కోట్ల ముడుపులు సౌత్ గ్రూప్ చెల్లించిందని, సౌత్ గ్రూప్ ను శరత్ చంద్రా రెడ్డి, కవిత, మాగుంట నియంత్రించారని ఈడీ పేర్కొంది. సౌత్ గ్రూప్ ద్వారా రూ.100 కోట్లను ఢిల్లీకి చెందిన ఆప్ లీడర్ విజయ్ నాయర్ కు చేరిందని, ఈ విషయాలను దర్యాప్తులో ఇచ్చిన వాంగ్మూలంలో అమిత్ అరోరా ఒప్పుకున్నారని ఈడీ వెల్లడించింది.
ఇక, గతంలో మాగుంట కుమారుడు రాఘవ్ మాగుంటను ఈడీ అధికారులు ప్రశ్నించిన సంగతి తెలిసిందే. రాఘవ్ నడుపుతున్న మాగుంట అగ్రో కంపెనీ రెండు జోన్లను దక్కించుకుందని ప్రచారం జరుగుతోంది. అయితే, ఢిల్లీ లిక్కర్ స్కాంలో తనకు ఎలాంటి పాత్ర లేదని ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అంటున్నారు. ఈడీ తన పేరు చేర్చడంతో ఆశ్చర్యపోయానని అన్నారు. గతంలో తాము మద్యం వ్యాపారాలు చేసిన మాట వాస్తవమేనని, కానీ, అవి మానేసి చాలాకాలం అయిందని అన్నారు. అమిత్ అరోరా ఎవరో తనకు తెలియదని మాగుంట చెప్పారు.