వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో అంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో, మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ వీడియోలో మాధవ్…మరో యువతితో నగ్నంగా వీడియో కాల్ మాట్లాడారని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. దీంతో, మాధవ్ ను ప్రతిపక్ష పార్టీల నేతలు దుమ్మెత్తిపోస్తున్నారు. ఎంపీ అయి ఉండి ఇవేం పాడుపనులు అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.
ఈ క్రమంలోనే ఆ వీడియో వ్యవహారంపై గోరంట్ల మాధవ్ స్పందించారు. అది మార్ఫింగ్ వీడియో అని, తాను జిమ్ లో ఎక్సర్ సైజ్ చేస్తున్న వీడియోను మీడియాకు ఢిల్లీలోని ఆంధ్రా భవన్ లో మాధవ్ చూపించారు. ఈ వీడియో వెనుక పెద్ద కుట్ర ఉందని, ఈ వీడియో తొలుత ఏబీఎన్ లో ప్రసారమయిందని చెప్పారు. అంతేకాదు, దీని వెనుక టీడీపీ నేత అయ్యన్న పాత్రుడి కుమారుడు చింతకాయల విజయ్, పొన్నూరి వంశీ, శివకృష్ణ తదితరులు ఉన్నారని ఆరోపించారు.
టీడీపీ నేతలకు దమ్ముంటే తనను నేరుగా ఎదుర్కోవాలంటూ మాధవ్ సవాల్ విసిరారు. ఆ వీడియో వ్యవహారంపై జిల్లా ఎస్పీకి తాను ఫిర్యాదు చేశానని , ఆ వీడియోను ఫోరెన్సిక్ టెస్టుకు పంపాలని కోరారు. తాను ఏ విచారణకైనా సిద్ధమేనని అన్నారు. ఈ వీడియోను తయారు చేసి సోషల్ మీడియాలో పెట్టిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. అంతేకాదు, ఆ వీడియోలో ఉన్నది తానే అని నిరూపిస్తే తన తల నరుక్కుని ఏబీఎన్ రాధాకృష్ణ కాళ్ల దగ్గర పెడతానని కూడా సవాల్ విసిరారు.