కొద్ది రోజుల క్రితం చిత్తూరు జిల్లాలోని పుంగనూరు, అంగళ్లులో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన సందర్భంగా గొడవ జరిగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో చంద్రబాబు సభను అడ్డుకునేందుకు వైసిపి శ్రేణులు విశ్వ ప్రయత్నాలు చేసి గొడవలు రేపాయని టీడీపీ నేతలు ఆరోపించారు. పుంగనూరు సరిహద్దు వరకు వచ్చిన చంద్రబాబు పర్యటించకుండానే వెనక్కు వెళ్లడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారంపై, చంద్రబాబు భద్రతపై జాతీయ స్థాయిలో చర్చ కూడా జరిగింది. ఆ ఘటనలో పోలీసులపై, వైసీపీ నేతలపై దాడులకు చంద్రబాబు ప్రేరేపించారని ఆయనపై హత్యాయత్నం కేసు కూడా నమోదు కావడం సంచలనం రేపింది.
ఇక, తాజాగా యువగళం పాదయాత్రపై వైసీపీ శ్రేణులు దాడి చేయడం, యువగళం వాలంటీర్లను పోలీసులు అర్ధరాత్రి అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పడం వంటి పరిణామాలు రాష్ట్రంలో కలకలం రేపాయి. దీంతో, చంద్రబాబు, లోకేష్ ల పర్యటనలకు వెళ్లే చోట గొడవలు రేపేందుకు వైసీపీ శ్రేణులు సిద్ధమవుతున్నాయని ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారానికి తగ్గట్లుగానే గుంతకల్లులో చంద్రబాబు పర్యటనను, సభను అడ్డుకొని తీరుతానని వైసిపి ఎంపీ గోరంట్ల మాధవ్ సంచలన ప్రకటన చేశారు. ఈ క్రమంలోనే అనంతపురంలో గోరంట్ల మాధవ్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం సంచలనం రేపింది.
తనను హౌస్ అరెస్ట్ చేయడంతో అనుచరులతో కలిసి ఇంటి దగ్గరే గోరంట్ల మాధవ్ నిరసన వ్యక్తం చేశారు. చంద్రబాబు దిష్టిబొమ్మ, ఫ్లెక్సీలతో ఇంటి ముందే బైఠాయించారు. రాయదుర్గంలో జగన్ ను ఉద్దేశించి చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారని, వైఎస్ విజయమ్మను కూడా ఆయన కించపరిచారని గోరంట్ల మాధవ్ ఆరోపణలు చేశారు. చంద్రబాబును మహిళలు క్షమించరని, ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే చంద్రబాబు పర్యటనను అడ్డుకొని తీరుతామని, ఆయనను నిలదీసేందుకు ఆయన శిబిరం వద్దకు వెళ్తానని గోరంట్ల మాధవ్ సవాల్ విసిరారు. జగన్ పుట్టుకపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారని, వెంటనే క్షమాపణలు చెప్పాలని గోరంట్ల డిమాండ్ చేశారు.