మామూలుగా సెల్ఫోన్ పోయిందే అనుకోండి స్టేషన్ కు వెళ్తే కేసు కట్టమన్నా కట్టరు.. ఫిర్యాదు ఇచ్చాక సిమ్ పోయిందని ఓ రిసీట్ తీసుకుని వెళ్లిపోవడం తప్ప ఏం చేయలేం కూడా! కానీ ఎంపీలూ మంత్రులూ ఫోన్లు పొగొట్టుకుంటే పోలీసులు తమ పనులన్నీ వదిలేసి సోదాలు చేసేసి స్వామిభక్తిలో తరిస్తుంటారు. ఆ విధంగా మంత్రులూ, ఎమ్మెల్యేలూ, ఎంపీలూ ఖాకీలకు ముచ్చెమటలు పోయిస్తుంటారు. విలువైన డేటా ఉన్న కారణంగా ఫోన్ పోగొట్టుకున్నవారికి టెన్షన్ ఉండడం సహజమే కానీ అనుమానం పేరిట పోలీసులు పలు చోట్ల సోదాలు చేసే సమయంలో నిబంధనలు మీరి ప్రవర్తించడమే సిసలు వివాదానికి కారణం.
వైసీపీ నాయకుల సెల్ఫీ గోల ఏమోకానీ సామాన్యులకు మాత్రం అవి పెద్ద తలనొప్పులే తెచ్చిపెడుతున్నాయి. మొన్నటికి మొన్న రోజా సెల్ఫోన్ ను మిస్ చేసుకున్నారన్న వార్త తిరుపతి లో హల్ చల్ చేసింది. ఆఖరికి ఆ ఫోన్ ఆమె స్టే చేసిన గదిలోనే ఉంది. తాజాగా రాజ మండ్రి ఎంపీ భరత్ వ్యవహారం మరో సారి వివాదానికి తావిస్తోంది. ఫోన్ పోగొట్టుకున్న ఆయన పోలీసులను ఆశ్రయించడంతో కథ కాస్త వివాదానికి తావిచ్చింది. పోలీసుల అతి కారణంగా ఎంపీ గారి ఫోను పోయిన వివాదం ఓ సామాన్య కుటుంబం పై వేధింపుల పర్వానికి తావిచ్చింది. దీంతో ఆ బాధిత కుటుంబం కన్నీరు మున్నీరవుతూ మానవహక్కుల కమిషన్ ను ఆశ్రయిస్తామని అంటోంది. ఆ వివరం ఈ కథనంలో..
రాజమండ్రి ఎంపీ భరత్ ఓ వివాదం ఇరుక్కున్నారు. రాష్ట్ర మంత్రి రోజాకు వీడ్కోలు పలికేందుకు రాజమండ్రి విమానాశ్రయానికి వెళ్లారు. అక్కడ ఆమెతో సెల్ఫీకి దిగారు. అనంతరం ఆయన ఫోన్ పోగొట్టుకున్నారు. దీనిపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇక్కడే అసలు కథ మొదలయింది. సాధారణంగా పౌరుల సెల్ ఫోన్ పోగొట్టుకున్న సంబంధింత మిస్సింగ్ కేసులను పోలీసులు పట్టించుకోరు కానీ ఎంపీ ఫోన్ కదా వెంటనే అలర్ట్ అయ్యారు. సిగ్నల్స్ ను ట్రేస్ చేశారు. ఆఖరికి గాడాల సమీపంలో ఓ క కాలనీలో నివసిస్తున్న శిరీష ఇంటి నుంచి ఫోన్ కు సంబంధించిన సిగ్నల్స్ వస్తున్నాయని గుర్తించారు.
వెంటనే అక్కడికి చేరుకుని ఇంటిని సోదా చేసి, ఇష్టా రాజ్యంగా వ్యవహరించి, సామానులు కింద పడేసి, సంబంధిత కుటుంబ సభ్యులపై పోలీసులు అతి ప్రవర్తన చేశారని బాధితురాలు శిరీష కన్నీటి పర్యంతం అయిచెబుతున్నారు. తమకు అస్సలు ఆ కేసుకు ఎటువంటి సంబంధం లేదని, అయినా పోలీసులు అతి కారణంగా తమ కుటుంబం మానసిక క్షోభ అనుభవించిందని, దీనిపై తాను కోర్టుకు వెళ్తానని అంటున్నారు బాధితురాలు. ఎలాంటి నోటీసు లేకుండా, మహిళ అని చూడకుండా అనుచితంగా ప్రవర్తించారని వాపోయారు. కానీ పోలీసులు మాత్రం తాము బాధితురాలు ఆరోపిస్తున్న విధంగా ప్రవర్తించలేదని చెబుతున్నారు.
Comments 1