సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి నోటీసులు రావడంతో ఈ రోజు సిబిఐ కోర్టు విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోని సిబిఐ కార్యాలయానికి మధ్యాహ్నం మూడు గంటల సమయంలో అవినాష్ రెడ్డి విచారణ కోసం హాజరయ్యారు. అంతకుముందు లోటస్ పాండ్ లో వైఎస్ విజయమ్మతో అవినాష్ రెడ్డి భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఈ క్రమంలోనే వైయస్ అవినాష్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ ను సీబీఐ అధికారులు రికార్డ్ చేశారు. అంతేకాదు, ఈ రోజు విచారణ ముగిసిన తర్వాత కూడా అవసరమైతే మరోసారి విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని అవినాష్ రెడ్డికి సీబీఐ అధికారులు స్పష్టం చేశారు. విచారణ సందర్భంగా అవినాష్ రెడ్డికి అధికారులు షాక్ ఇచ్చారు. తనతోపాటు తన లాయర్ ని కూడా విచారణ సమయంలో అనుమతించాలని అవినాష్ చేసిన విజ్ఞప్తిని సీబీఐ అధికారులు తోసిపుచ్చారు.
అవినాష్ రెడ్డి లాయర్ ను సిబిఐ ఆఫీస్ బయటే అధికారులు ఆపేయడంతో అవినాష్ రెడ్డికి చుక్కెదురైనట్లయింది. ఇక, విచారణ సందర్భంగా సీబీఐ కార్యాలయం వద్దకు చేరుకున్న వైసీపీ శ్రేణులను పోలీసులు అక్కడినుంచి పంపించేశారు. మరోవైపు, వివేకా హత్య కేసు తెలంగాణలోని హైదరాబాద్ సీబీఐ కోర్టుకు బదిలీ అయిన నేపథ్యంలో ఆ కోర్టు తాజాగా విచారణ ప్రారంభించింది. ఈ కేసుకు సంబంధించిన ప్రధాన చార్జిషీట్, అనుబంధ చార్జిషీట్లను విచారణకు హైదరాబాద్ సీబీఐ కోర్టు స్వీకరించింది.
అంతేకాదు, ఈ కేసులో ఐదుగురు నిందితులు ఉమాశంకర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, దస్తగిరి, శివ శంకర్ రెడ్డిలకు కోర్టు సమన్లు జారీ చేసింది. ఫిబ్రవరి 10న వారు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. వివేకా కూతురు సునీత రెడ్డి విజ్ఞప్తితో సుప్రీంకోర్టు వివేకా కేసును ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ సీబీఐ కోర్టుకు బదిలీ చేసిన సంగతి తెలిసిందే.