వైసీపీ హయాంలో ఆ పార్టీ నేతలు ఇష్టారీతిన వ్యవహరించిన సంగతి తెలిసిందే. అధికారం చేతిలో ఉంది కదా అని టీడీపీ ఆఫీసులు, టీడీపీ కార్యకర్తలపై దాడులకు తెగబడిన వైనంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే జగన్ పాలనలో మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ ఎమ్మెల్సీలు తలశిల రఘురామ్, లేళ్ల అప్పిరెడ్డి, వైసీపీ నేత దేవినేని అవినాశ్ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. చాలాకాలంగా అజ్ఞాతంలో ఉన్న వీరు తాజాగా మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కు వచ్చారు.
పోలీసులు అన్ని కోణాల్లో వారిని ప్రశ్నిస్తున్నారు. అయితే, విచారణకు ఆ ముగ్గురూ సహకరించడం లేదని, తమకేమీ తెలియదని సమాధానాలు ఇస్తున్నారని తెలుస్తోంది. మూడు గంటలపాటు వారిని పోలీసులు విచారణ జరిపారని తెలుస్తోంది. మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కు రావాలని వారికి పోలీసులు నోటీసులు ఇవ్వడంతో వారు ఎట్టకేలకు అజ్ఞాతాన్ని వీడి పోలీసుల విచారణకు వచ్చారు. అంతకుముందు వారికి 41ఏ సెక్షన్ కింద పోలీసులు నోటీసులు ఇచ్చారు. తమ పాస్ పోర్టులను వారు మంగళగిరి రూరల్ పీఎస్ లో అందజేశారు.