“ప్రజల్లో ఉండండి. ప్రజల మాట వినండి. పార్టీ ప్రకటిస్తున్న సంక్షేమాన్ని, భవిష్యత్తు కార్యాచరణను ఆలంబనగా చేసుకుని గెలుపు గుర్రాలుగా మారండి. మీకే టికెట్ ఇస్తా“-2022, మార్చి 13న తాడేపల్లి వేదికగా.. 150 మంది(జగన్ మినహా) ఎమ్మెల్యేలకు వైసీపీ అధినేత హోదాలో సీఎం జగన్ చేసిన మేలిమి సూచన ఇది. కానీ, దీనిని ఎంత మంది పాటించారు? ఎవరు అనుసరించారు? అంటే.. వేళ్లపై లెక్కించుకునే పరిస్థితి ఏర్పడిందన్నది అసలు వాస్తవం. చేతులు కాలేదాకా తెచ్చుకోవద్దన్న దిశానిర్దేశాన్ని కూడా.. నాయకులు పెడచెవిన పెట్టారు.
“వచ్చే ఎన్నికలు భీకరంగా ఉంటున్నాయి. ఈ ఒక్కసారి గెలిస్తే.. మనకు 30 ఏళ్ల వరకు తిరుగులేదు. మీలో ఎంత మంది పనిచేస్తున్నారో.. చేయడం లేదో నాకు తెలుసు. ఇప్పటికైనా మారండి“-2022, అక్టోబరు 16న అదే జగన్.. అదే ఎమ్మెల్యేలకు చెప్పిన మాట. మళ్లీ నాయకులు పెడచెవినే పెట్టారు. కేవలం ఫొటోలకు ఫోజులివ్వడం.. ఆవేశాలకు హద్దులు లేకుండా చేసుకోవడం రివాజుగా మారింది. పనిచేయండయ్యా.. ప్రజల్లో ఉండడయ్యా.. అంటే.. కేవలం మీడియా ముందు నాలుగు ఫొటోలకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చిన నాయకులు సగానికి పైగానే ఉన్నారు.
మరి ఇలాంటి వారిని తన టీంలో పెట్టుకుని జగన్ మాత్రం ఎలా భరిస్తారు? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. మారుతున్న రాజకీయాలు.. ప్రజానాడిని పట్టుకునే ప్రయత్నంలో పార్టీలు.. దూకుడుగా ఉంటున్నాయి. ఈ విషయంలో ఇతర పార్టీలకంటే కూడా.. వైసీపీ నాలుగు అడుగులు ముందుగానే ఉంది. లేక పోతే.. ఇన్నిన్ని పథకాలు, ఇంతింత సంక్షేమం సాధ్యమేనా? అన్నది మేధావుల మాట. అధినేత మనసునెరిగి.. ప్రజల మనసుల్లో చోటు దక్కించుకునే ప్రయత్నం చేయలేకపోయిన వారినే ఇప్పుడు పక్కన పెడుతున్నారు తప్ప.. వ్యక్తిగత ద్వేషంతోనో.. విమర్శలతో నో.. వారిని పక్కన పెడుతున్న దాఖలాలు లేవు.
“ఇది మన ప్రభుత్వం. మనందరి ప్రభుత్వం“ అనదగిన.. అన్న నాయకుడు ఎవరైనా ఉంటే.. అది జగనే అనడంలో సందేహం ఏముంది? మరి మన ప్రభుత్వాన్ని మనమే గెలిపించుకునేందుకు పక్కా కార్యాచరణకు పూనుకున్న నాయకులు లేకపోవడం.. పైపై మెరుగులతో అధినేత కళ్లకు గంతలు కట్టాలని ప్రయత్నం చేయడం వంటివే ఇప్పుడు ప్రధాన ప్రమాదంగా పొడుచుకొచ్చింది. మైనింగ్, ఇసుక, గ్రావెల్.. వంటి అనేక అంశాల్లో ఆరోపణలు ఎదుర్కొన్న నాయకులు.. ఏం జరిగినా.. పార్టీ తమను కాపాడుతుందనే అతి విశ్వాసం ప్రదర్శించారనే విమర్శలు వున్నాయి. కానీ, జగన్ ఈ విషయంలోనే సీరియస్ గా ఉన్నారన్న సంకేతాలు వెళ్లినా.. జానేదేవ్ అన్నట్టుగా వ్యవహరించారు. ఫలితంగా ఇప్పుడు టికెట్లకు ఎసరు వచ్చే సరికి తర్జన భర్జన పడుతున్నారు. స్వయంకృతం ఎవరు మోస్తారో.. నాయకులే తేల్చుకోవాలి!!