ప్రజా ప్రతినిధులు ఎవరు ఎందుకు విదేశాలకు వెళ్ళినా జనాలందరు అనుమానించాల్సిన పరిస్థితి. క్యాసినో గొడవలు పెరుగుతున్న కారణంగా మనోళ్లకు ఇండియాకంటే కెసినోలకు విదేశాలకు వెళ్లే అలవాటు చేసుకున్నారు. ఇపుడిదంతా ఎందుకంటే కడప జిల్లాలోని కొందరు ప్రజాప్రతినిధులు విదేశాలకు వెళ్ళారు. మామూలుగా ఒక్కరో లేకపోతే ఇద్దరు ఫారెన్ వెళితే ఎవరూ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఒకేసారి నలుగురైదుగురు వెళ్ళేసరికి జనాల్లో అనుమానాలు మొదలయ్యాయి.
వెళ్ళిన ప్రముఖులు కూడా ఒకే జిల్లా కడపకు చెందిన వారు కావడంతో అనుమానాలు మరింతగా పెరిగిపోతున్నాయి. ఇక్కడ విషయం ఏమిటంటే ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాషా, జమ్మలమడుగు ఎంఎల్ఏ డాక్టర్ సుధీర్ రెడ్డి, కమలాపురం ఎంఎల్ఏ రవీంద్రనాథ్ రెడ్డి, మైదుకూరు ఎంఎల్ఏ రఘురామిరెడ్డి, జడ్పీ చైర్మన్ ఆకేపాటి అమరనాధరెడ్డి, కడప మేయర్ సురేష్ బాబు, సీనియర్ నేత మాసీనుబాబుతో పాటు మరికొందరు కూడా విదేశాలకు వెళ్ళారట.
ఫారెన్ వెళ్ళిన వీళ్ళంతా రష్యా సమీప దేశాల్లోనే పర్యటిస్తున్నారట. అది కూడా ఒక ఎంఎల్ఏ ఆహ్వానం కారణంగానే వెళ్ళినట్లు చెప్పుకుంటున్నారు. ఒకేసారి ఇంతమందిని రష్యా చుట్టుపక్కల దేశాలకు ఆహ్వానించిన ఆ ఎంఎల్ఏ ఎవరో అర్ధం కావటం లేదు. ఇంట్లో ఫంక్షన్ జరిగితే అందరినీ పిలవటం, అందరు హాజరవ్వటం చాలా మామూలే. కానీ రష్యా చుట్టుపక్కల ప్రాంతాల్లోని దేశాలకు ఒక ఎంఎల్ఏ ఎలా ఆహ్వానించారు ? ఎందుకు ఆహ్వానించారు ? ఎవరో ఎంఎల్ఏ ఆహ్వానిస్తే ఇంతమంది ఒకేసారి ఎలా వెళ్ళారనేదే ఇక్కడ అసలు పాయింట్. ఏమాటకామాటే జనాలు ఏమనుకుంటారు అనే భయం వైసీపీ ఎమ్మెల్యే కించిత్ కూడా కనపడదబ్బా.
ఈ మధ్యనే తెలంగాణాకు చెందిన చికోటి ప్రవీణ్ అనే వ్యక్తి తెలుగు రాష్ట్రాల్లోని కొందరు ప్రజాప్రతినిధులు, ప్రముఖులను విదేశాలకు తీసుకెళ్ళి క్యాసినోలు ఆడిస్తున్న విషయం బయటపడింది. చికోటి ద్వారా శ్రీలంక, సింగపూర్, మలేషియా, నేపాల్ తో పాటు రష్యాకు కూడా వెళ్ళి క్యాసినోలు ఆడుతున్నట్లు విచారణలో బయటపడింది. ఇపుడు కడపజిల్లాలోని ఇంతమంది ప్రజాప్రతినిధులు ఒకేసారి రష్యా చుట్టుపక్కల దేశాల్లో పర్యటిస్తున్నారు అనగానే అందరికీ క్యాసినోలే గుర్తుకొస్తున్నాయి.