ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్న చందంగా వైసీపీ సభ్యుల తీరు తయారైంది. అనర్హత వేటు పడుతుంది అన్న భయంతో వైసీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే జగన్ చాలా కాలం తర్వాత ఇటీవల అసెంబ్లీకి వచ్చి హాజరు వేసి వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే, ఆ హాజరు చెల్లదు అని అసెంబ్లీ అధికారులు చెప్పడం వేరే విషయం. ఈ క్రమంలోనే కొందరు సభ్యులు దొంగల్లా వచ్చి అటెండెన్స్ వేసి వెళ్ళిపోతున్నారని ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు పరోక్షంగా వైసీపీపై చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ చివరి రోజు సమావేశాల సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు కీలక వ్యాఖ్యలు చేశారు. కొందరు ఎమ్మెల్యేలు సభకు దొంగల్లా వచ్చి వెళ్లిపోతున్నారని, అది మంచి పద్ధతి కాదని అన్నారు. అటెండెన్స్ రిజిస్టర్ లో సంతకం చేసి సైలెంట్ గా అసెంబ్లీ నుంచి మాయమవుతున్నారని విమర్శించారు. రిజిస్టర్ లో సంతకం పెట్టిన పలువురు ఎమ్మెల్యేలు సభలో కనిపించడంలేదని ఆరోపించారు. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు ఇలా చేయడంపై అయ్యన్న అసహనం వ్యక్తం చేశారు.
తాటిపర్తి చంద్ర శేఖర్, విరూపాక్షి, దాసరి సుధ తదితర వైసీపీ ఎమ్మెల్యేలు ఆ ఏడుగురిలో ఉన్నారని వారి పేర్లు చదివి వినిపించారు. గవర్నర్ ప్రసంగం తర్వాత వేరు వేరు రోజుల్లో వారు వచ్చి సంతకాలు పెట్టి వెళ్లారని చెప్పారు. ఇలా సంతకం పెట్టి వెళ్లకుండా హుందాగా సభకు హాజరై మాట్లాడవచ్చు కదా అని సూచించారు. 24 ప్రశ్నలు అడిగిన వైసీపీ సభ్యులు సభలో లేరని, దీని వల్ల సభా సమయం వృథా అవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ప్రశ్నలకు జవాబు ఏంటని తెలుసుకోకుండా వెళ్లిపోతున్నారని మండిపడ్డారు.