ఏపీ అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి. ఐదు రోజుల పాటు జరిగిన ఈ సమావేశాలు.. అధికార పార్టీకి అందివ చ్చిన అవకాశంగా మారాయి. ఒకవైపు ప్రతిపక్ష టీడీపీ సభ్యులు తమకు తామే విధించుకున్న సభల బహిష్కరణ నిర్ణయం దరిమిలా… తొలి రెండు రోజులు ఎలా జరిగినా.. తర్వాత మూడు రోజులు మాత్రం వైసీపీ సభ్యులు సభను.. స్తోత్ర పాఠాలు, భజనలు, కీర్తనలు, సంకీర్తనలు, మెచ్చుకోళ్లు, మేళతాళాలు వంటి సంప్రదాయ గానా భజానాతో ఖుషీ చేశారు.
ముఖ్యమంత్రి(గారు) జగన్ను ఆకాశానికి ఎత్తేశారు. భావుడు నుంచి మహానుభావుడి వరకు, దేవుడి నుంచి దేవదేవుడి(గూడూరు ఎమ్మెల్యే స్తుతి) వరకు ఇలా… జగన్ను ఆకాశం దాటించి అంతరిక్షం వరకు మోసుకు వెళ్లే ప్రయత్నం చేశారు. కట్ చేస్తే.. ఇంత ఊపులోనూ.. ఇంత గానా భజనాలోనూ కొందరు వైసీపీ ఎమ్మెల్యేల ముఖంలో కాంతులు కనిపించలేదట!! వారి ముఖంలో భ్రాంతి తప్ప.. కాంతి కనిపించని పరిస్థితిని గమనించిన ఇంకొందరు ఎమ్మెల్యేలు `విషయం ఏంటని` ఆరా తీశారట.
దీనికి సదరు ఎమ్మెల్యేలు చెప్పిన విషయం విన్నాక.. మిగిలిన వారిలోనూ దిగులు.. బెంగ వంటి కొన్ని సూచనలు పొడచూపాయట!.. ఇంతకీ విషయం ఏంటంటే.. టీడీపీకి బలమైన కంచుకోటల వంటి నియోజ కవర్గాల నుంచి విజయం దక్కించుకున్న ఎమ్మెల్యేలకు ఇప్పుడు పరిస్థితి భిన్నంగా మారిపోయిందనేది కీలక విషయం. చంద్రబాబు అరెస్టు, జైలు తర్వాత.. ఈ నియోజకవర్గాల్లో సానుభూతి కుండపోత వర్షం మాదిరిగా టీడీపీపై కురుస్తోందని…. ఈ సానుభూతి దెబ్బకు తాము కకా వికలం కావడం ఖాయమని నాయకులు తెగ వాపోతున్నారట.
ఈ విషయంపై దిగులు, చింతతోనే.. చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు.. మాట్లాడేందుకు సభలో సమయం కోరి మరీ వెనక్కి తగ్గడానికే మొగ్గు చూపినట్టు మరికొందరు ఎమ్మెల్యేల టాక్. ఏది ఏమైనా.. సభ అయితే జరిగింది.. స్తోత్ర పాఠాలూ మిన్నంటాయి.. కానీ, టీడీపీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో అరకొర మెజారిటీ.. అత్తెసరు మెజారిటీతో విజయం దక్కించుకుని మమ అని అనిపించుకున్నవారు మాత్రం.. ఈ సారి తడిగుడ్డ ఖాయమని వాపోతున్నారట.. ఇదీ సంగతి!!