ఒకటి తర్వాత మరొకటి చొప్పున వరుస పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఆంధ్రప్రదేశ్ లో. రాష్ట్ర అధికారపక్షం వైసీపీ తన అభ్యర్థుల జాబితాను ప్రకటించేయటం.. ఇటీవల కాలంలో విపక్ష టీడీపీ తన అభ్యర్థుల్ని విడతల వారీగా ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటివేళ.. టికెట్లు రాని నేతలు పక్క చూపులు చూస్తున్నారు. పార్టీ మారేందుకు వెనుకాడటం లేదు. తాజాగా అలాంటి నిర్ణయాన్నే తీసుకున్నారు తిరుపతి జిల్లా గూడూరు వైసీపీ ఎమ్మెల్యే పార్టీకి గుడ్ బై చెప్పేశారు.
తాజాగా ఆయన బీజేపీలో చేరారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్.. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ థావడే సమక్షంలో ఆయన కమలం పార్టీలో చేరారు. కాషాయ కండువా కప్పుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వరప్రసాద్ కు గూడురు టికెట్ కు నో చెప్పిన వైసీపీ ఆయనకు బదులుగా మేరిగ మరళీధర్ కు అవకాశాన్ని కల్పించింది. ఈ నేపథ్యంలో ఆయన వైసీపీని వీడారు. తాజాగా బీజేపీలో చేరారు.
వరప్రసాద్ విషయానికి వస్తే ఆయన 2014లో తిరుపతి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం 2019 ఎన్నికల్లో గూడురు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కానీ.. ఈసారి ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇచ్చేందుకు నో చెప్పారు. దీంతో.. బీజేపీ వైపు చూసిన వరప్రసాద్ తాజాగా పార్టీలోచేరారు. రానున్న ఎన్నికల్లో తిరుపతి ఎంపీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లుగా చెబుతున్నారు. బీజేపీ సైతం అందుకు సుముఖంగా ఉందని.. త్వరలో విడుదలయ్యే అధికార జాబితాలో ఆయన పేరు ఉంటుందని చెబుతున్నారు. ఈ నిర్ణయం వైసీపీకి ఇబ్బందికి గురి చేస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.