2024 ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది ఆంధ్రప్రదేశ్ రాజకీయ వాతావరణం క్రమక్రమంగా వేడెక్కుతోంది. వైసీపీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత నానాటికీ పెరిగిపోతోంది. మరోవైపు కొంతమంది సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వనని సీఎం జగన్ కరాఖండిగా చెప్పేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తమ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారడంతో చాలామంది వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు, వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు, వైసీపీ కీలక నేతలు పక్క పార్టీలవైపు చూస్తున్నారు.
ఈ క్రమంలోనే కొందరు వైసీపీ నేతలు టీడీపీలో చేరుతుండగా మరికొందరు జనసేన వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా వైసీపీ ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ జనసేనలో చేరారు. వంశీకృష్ణ యాదవ్ కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జనసేనలో చేరడం సంతోషంగా ఉందని, సొంత ఇంటికి తిరిగి వచ్చినట్టు అనిపిస్తోందని ఆయన అన్నారు. గతంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు యువరాజ్యంలో పవన్ ఆధ్వర్యంలో పని చేశానని, ఇప్పుడు మరోసారి ఆయన నేతృత్వంలో పనిచేసే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉందని వంశీకృష్ణ చెప్పారు. ఉత్తరాంధ్రలో ప్రత్యేకించి విశాఖలో జనసేన బలోపేతం చేసేందుకు, పవన్ ను ముఖ్యమంత్రిని చేసేందుకు శాసనం కృషి చేస్తానని అన్నారు.
ఇక వంశీకృష్ణ బలమైన నాయకుడని, ఆయన చేరిక పార్టీకి మరింత బలం ఇచ్చిందని పవన్ కళ్యాణ్ అన్నారు. చాలా కాలంగా ఆయనతో పరిచయం ఉందని, యువరాజ్యంలో కలిసి పనిచేశామని గుర్తు చేసుకున్నారు. స్వల్ప తేడాతో విశాఖ ఈస్ట్ నుంచి అప్పట్లో ఓడిపోయి, తర్వాత ఎమ్మెల్సీ అయ్యారని అన్నారు. సొంత కుటుంబంలోకి ఆయనకు స్వాగతం పలుకుతున్నానని పవన్ చెప్పారు. యువరాజ్యంలో పనిచేసిన నేతలు ఇప్పుడు బలమైన నాయకులుగా ఉండడం ఆనందంగా ఉందని పవన్ చెప్పారు.