తమ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందంటూ స్వయంగా వైసిపి మంత్రులు ఒప్పుకుంటున్న వైనం ఆ పార్టీ అధినేత జగన్ కు మింగుడు పడడం లేదన్న సంగతి తెలిసిందే. జనాల్లో వైసిపి సర్కార్ పై వ్యతిరేకత ఉందని మంత్రి ధర్మాన ప్రసాదరావు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలలో దుమారం రేపాయి. ఆ వ్యాఖ్యల వేడి సద్దుమణగక ముందే తాజాగా మరో ఎమ్మెల్యే తమ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని అంగీకరించడం సంచలనం రేపింది.
అయితే, అధికారుల తప్పుడు నిర్ణయాల వల్లే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందంటూ అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు షాకింగ్ గా మారాయి. అంతేకాదు అధికారుల తీరు మారకపోతే రైతులతో కలిసి అధికారులకు వ్యతిరేకంగా ధర్నా చేస్తామంటూ సాక్షాత్తు ఎమ్మెల్యే వార్నింగ్ ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పౌరసరఫరాల శాఖ కమిషనర్ అరుణ్ కుమార్ తో కలిసి తన నియోజకవర్గంలో సూర్యనారాయణ రెడ్డి పర్యటించారు.
ఈ సందర్భంగా ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు ఫిర్యాదు చేశారు. దీంతో, అధికారులపై సూర్యనారాయణ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏసీ గదుల్లో కూర్చొని ధాన్యం కొనుగోళ్లపై నిర్ణయాలు తీసుకుంటే ఇలాగే ఉంటుందని ఆయన ఫైర్ అయ్యారు. ధాన్యం కొనుగోళ్లకు వలంటీర్లకు ఎలా అప్పగిస్తారని, అసలు వాలంటీర్లకు ఏం తెలుసు అని ఆయన ప్రశ్నించారు. జగన్ కు కూడా అధికారులు తప్పుడు సలహాలు ఇస్తున్నారేమో అని అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు.
జగన్ ను చెడుగా చిత్రీకరించేందుకు అధికారులు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారేమో అని అనుమానం వ్యక్తం చేశారు. ఒకటి రెండు రోజుల్లో ఈ సమస్య పరిష్కారం అయితే సరేనని కాకపోతే రైతులతో కలిసి ధర్నాకు దిగుతానని అధికారులను హెచ్చరించారు. ఉరిమి ఉరిమి మంగళం మీద పడ్డట్టు తమ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు అధికారులను సూర్యనారాయణ రెడ్డి బలి చేశారంటూ సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి.