పెగాసస్ సాఫ్ట్ వేర్ కొనుగోలుపై వైసీపీ – బీజేపీలు ఏకమయ్యాయి. చంద్రబాబు నాయుడు హయాంలో పెగాసస్ సాఫ్ట్ వేర్ కొనుగోలు చేసినట్లు మంత్రులు, వైసీపీ ఎంఎల్ఏలు ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయమై విచారణ జరిపేందుకు అసెంబ్లీ హౌస్ కమిటిని నియమించాలని కూడా అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఇదే విషయమై ఇపుడు బీజేపీ కూడా అధికార పార్టీతో గొంతు కలిపింది.
తన హయాంలో చంద్రబాబు పెగాసస్ సాఫ్ట్ వేర్ కొన్నారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు తమ నేతల్లో కొందరి ఫోన్లు ట్యాపింగ్ జరుగుతోందని తాము అప్పట్లోనే ఫిర్యాదులు చేసిన విషయాన్ని ఇఫుడు విష్ణు గుర్తుచేస్తున్నారు. తమ ఫోన్లను ట్యాపింగ్ చేయిస్తున్న విషయాన్ని తమ అధ్యక్షుడు సోము వీర్రాజు అప్పట్లో పదే పదే ఆరోపించిన విషయాన్ని విష్ణు ప్రస్తావించారు.
చంద్రబాబు మీద పెగాసస్ సాఫ్ట్ వేర్ కొనుగోలుపై హౌస్ కమిటీ వేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. హౌస్ కమిటీ సమగ్రంగా విచారించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇదే విషయమై సమగ్ర దర్యాప్తు కోరుతూ కేంద్రానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయాలని సూచించారు. మొత్తం మీద రాజకీయంగా ఎన్ని విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నా పెగాసస్ విషయంలో మాత్రం వైసీపీ-బీజేపీలు ఏకమవ్వటం విశేషమే.
ఇప్పటివరకు చంద్రబాబు పెగాసస్ కొన్నారనేందుకు నిర్దిష్టమైన ఆధారాలైతే కనబడలేదు. నిరూపించలేనపుడు ఆ విషయంపై పదే పదే ఆరోపణలు చేయటం కూడా వేస్టే. ఎందుకంటే పెగాసస్ సాఫ్ట్ వేర్ కొనుగులు చేసినట్లు ఇప్పటివరకు కేంద్రప్రభుత్వమే అంగీకరించలేదు. అయితే, తాజాగా చంద్రబాబుపై ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో వైసీపీ సర్కారు పెగాసెస్ సాఫ్ట్ వేర్ వాడుతోందని స్వయంగా వైసీపీ ఎమ్మెల్యే గుట్టు రట్టు చేశారు. దేశంలోని ప్రతి రాష్ట్రంలోనూ ఫోన్ ట్యాపింగ్ పరికరాల్ని.. ఇతర సాఫ్ట్ వేర్ లను దేశ భద్రత కోసం వినియోగిస్తారన్నారు.
తమ ప్రభుత్వం కూడా రహస్యంగా కాల్స్ వినడానికి సాఫ్ట్ వేరు వాడుతోందని, అయితే, దానిని రాష్ట్ర ప్రయోజనాల కోసం వినియోగిస్తుంది తప్పించి.. నేతల వ్యక్తిగత అంశాల జోలికి వెళ్లమని గుడి వాడ ఎమ్మెల్యే అమరనాథ్ అన్నారు. చంద్రబాబు ఏం చేస్తున్నారు? ఆయన సతీమణితో ఏం మాట్లాడుతున్నారు? బాబు కుమారుడు.. కోడలు ఏం మాట్లాడుతున్నారన్న విషయాల్ని తెలుసుకునేందుకు వీటిని వినియోగించమంటూ వ్యాఖ్యానించారు. మొత్తానికి తెలుగుదేశాన్ని ఇరుకున పెట్టడానికి ఒక అవకాశం దొరికిందని వైసీపీ సంబరపడుతుంటే వారి ఆశలపై సొంత ఎమ్మెల్యే నీళ్లు చల్లేశారు.