సీఎం జగన్ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వ పాలన ఏమాత్రం బాగోలేదని, రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతుందని టీడీపీ సహా ప్రతిపక్ష నేతలంతా విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఇటీవల కాలంలో జగన్ పై సొంత పార్టీకి చెందిన నేతలు కూడా కొందరు విమర్శలు గుప్పించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. తమ ఫోన్లు ట్యాప్ చేస్తున్నారంటూ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపించడం దుమారం రేపింది. ఈ నేపథ్యంలోనే తాజాగా సొంత పార్టీపై ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు.
ప్రభుత్వాలపై అవినీతి ఆరోపణలు కొత్త కాదని, తామేమీ సత్యవంతులం కాదని ప్రతాప్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపుతోంది. అయితే, గతంలో టీడీపీ హయాంలోనూ ఇప్పటికంటే ఎక్కువ ఆరోపణలు వచ్చాయని, ఇలా ప్రభుత్వాలపై అవినీతి ఆరోపణలు రావడం కొత్త కాదని ప్రతాప్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చారు. గతంలో బీద రవిచంద్ర 400 కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడ్డారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాదు, రవిచంద్రతోపాటు టీడీపీ నియోజకవర్గ బాధ్యుడు మాలపాటి సుబ్బారాయుడు కూడా దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు.
మరోవైపు, పురపాలక అధికారులపై విమర్శలు వస్తున్నాయని, ఇకపై అటువంటి వాటికి తావు లేకుండా చూస్తామని ప్రతాప్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఒకవేళ ఇళ్ల నిర్మాణాల ప్లానులకు మునిసిపాలిటీ అధికారులు మామూలు డిమాండ్ చేస్తే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. కావలిలోని వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన ప్రతాప్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైసీపీ వర్గాల్లో దుమారం రేపుతున్నాయి. కాగా, ప్రతాప్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలపై సీఎం జగన్ కూడా గుర్రుగా ఉన్నట్గా తెలుస్తోంది. ఇదే జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి కూడా గతంలో తమ ప్రభుత్వంపై షాకింగ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.