జగన్ సీఎం అయిన ఏడాది తర్వాత నుంచి రాష్ట్రంలోని ఏ రచ్చబండ దగ్గర చూసినా ఒకటే చర్చ….కొద్దో గొప్పో ఆర్థిక వ్యవస్థపై, అప్పులు, రాబడులపై అవగాహన ఉన్న వారి నోట ఒకటే మాట…అంతెందుకు నలుగురుండే ఓ కుటుంబాన్ని నడిపే ఓ కుటుంబ పెద్దకు కూడా తెలిసిన చిన్న లాజిక్ జగన్ మిస్సయ్యారని చర్చ…..ఆంధ్రా భవిష్యత్తు ఏమిటి? జగన్ దిగిపోయేనాటికి ఏపీలో ఒక్కో తలపై ఎంత అప్పు ఉంటుంది? జగనన్న పప్పు, బెల్లాల పంపకానికి, పథకాలకు అంతముందా? అన్న ప్రశ్నలు చాలామంది మదిని తొలిచి వేస్తున్నారు.
అయితే, జగన్ ప్రవేశపెట్టిన ఉచిత పథకాలు లోపభూయిష్టంగా ఉన్నాయని, కొన్ని ఉచిత పధకాలు ప్రజలను సోమరిపోతులను చేస్తున్నాయని ప్రతిపక్ష టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అమ్మఒడి పథకంలో డబ్బులు తీసుకొని…నాన్న బుడ్డి కొనుక్కుంటున్నారని విమర్శిస్తున్నారు. అయితే, ప్రతిపక్షాలది అనవసర రాద్ధాంతం అని కొట్టిపడేసినవారంతా ఇపుడు పశ్చాత్తాపడుతున్నారు.
ఎందుకంటే, తాజాగా వైసీపీ ఎమ్మెల్యే ఒకరు తమ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలపై సంచలన విమర్శలు చేశారు. జగన్ ప్రతిష్టాత్మకంగా కొనసాగిస్తోన్న అమ్మఒడి పథకంపై మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అమ్మఒడి పథకం వర్తింపజేయడం సరికాదని షాకింగ్ కామెంట్లు చేశారు. డబ్బులున్నవారే ప్రైవేటు పాఠశాలల్లో చదువుతారు కాబట్టి వారికి ఆ డబ్బులు అనవసరమని అన్నారు.
అంతేకాదు, కడప జిల్లా స్త్రీ, శిశు సంక్షేమశాఖ (ఐసీడీఎస్) అధికారులపై కూడా ఆయన ఫైర్ అయ్యారు. మండిపడ్డారు. ఈ శాఖ అవినీతి ఊబిలో కూరుకుపోయిందని, సూపర్ వైజర్ల బదిలీల్లో భారీస్థాయిలో అవినీతి జరిగిందని ఆరోపించారు. డబ్బులిచ్చిన వారికి కావాల్సిన చోట ట్రాన్స్ ఫర్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ విషయంలో ఎక్కడా సరైన పర్యవేక్షణ లేదని ప్రభుత్వంపైనే విమర్శలు గుప్పించారు. మరి, రఘురామిరెడ్డిపై జగన్ రియాక్షన్ ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.