సినీ నిర్మాతలపై వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేయడం పెను దుమారం రేపుతోంది. సినిమా వాళల్కు అసలు ఆంధ్రప్రదేశ్, ఇక్కడ సీఎం జగన్ గుర్తున్నారా అని ప్రశ్నించారు. పేదవాడి కోసం టికెట్ రేట్లు తగ్గించడంలో తప్పేంటని ప్రశ్నించారు. అంతేకాదు, సినిమా వాళ్లకు చంద్రబాబు సపోర్ట్‌గా ఉన్నారంటూ ఆరోపించారు. హీరోలందరూ కోట్లు సంపాదిస్తూ విలాసంగా బ్రతుకుతున్నారని, నిర్మాతలు బలిసిన వాళ్లని షాకింగ్ కామెంట్స్ చేశారు.
ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, నటులకు జగన్, ఏపీ గుర్తులేవని, తెలంగాణలో కూర్చుని.. అక్కడ సినిమాలు చేసుకుంటూ ఏపీ గురించి మాట్లాడటం కరెక్ట్ కాదని అన్నారు. దీంతో, ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిర్మాతల మండలి ఖండించింది. అలా వ్యాఖ్యానించడం బాధాకరమని, ఆ వ్యాఖ్యలు యావత్ చిత్ర పరిశ్రమను అవమానించడమేనని స్పష్టం చేసింది. తెలుగు సినిమా సక్సెస్ రేటు 2 నుంచి 5 శాతం మాత్రమేనని, మిగిలిన సినిమాలు నష్టపోతుంటాయని వెల్లడించింది.
ఇండస్ట్రీలోని 24 క్రాఫ్ట్స్ కు పని కల్పిస్తున్నామని, నానా తిప్పలు పడి కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీసి ఆస్తులు అమ్ముకున్న నిర్మాతలూ ఉన్నారని చెప్పంది. అలా కష్ట నష్టాల బారినపడిన కొందరు నిర్మాతలు నిర్మాతల మండలి నుంచి నెలకు రూ.3 వేల పెన్షన్ తీసుకుంటున్నారని గుర్తు చేశారు. నిర్మాతల దారుణ పరిస్థితులు ఆ విషయంతో తేటతెల్లమవుతోందని అన్నారు. కానీ, గౌరవనీయ ఎమ్మెల్యే వాస్తవాలు తెలుసుకోకుండా నిర్మాతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారని, ఆ వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని నిర్మాతల మండలి డిమాండ్ చేసింది. మరి, ఈ లేఖపై ప్రసన్న కుమార్ రెడ్డి స్పందన ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.