ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నెల్లూరుకు చెందిన ముగ్గురు వైసీపీ నేతలపై సస్పెన్షన్ వేటు పడిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలకు కొద్ది నెలల ముందుగానే ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు పార్టీపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఇక, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికలలో క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారని ఆరోపిస్తూ పార్టీ సస్పెండ్ చేసింది. దీంతో నెల్లూరు వైసీపీలో ముసలం మొదలైంది.
వైసీపీకి పెట్టనికోటగా ఉన్న నెల్లూరులో లుకలుకలు మొదలయ్యాయని టాక్ వస్తోంది. అయితే, అలాంటిదేమీ లేదు, రాబోయే ఎన్నికల్లో కూడా వైసీపీదే గెలుపు అని నెల్లూరు జిల్లాకు చెందిన మిగిలిన వైసీపీ నేతలు అంటున్నారు. ఈ రకంగా రాష్ట్ర రాజకీయాలలో నెల్లూరు వైసీపీ పెద్ద రెడ్ల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలోనే తాజాగా నెల్లూరుకు చెందిన మరొక వైసీపీ రెడ్డి నేత త్వరలోనే వైసీపీకి గుడ్ బై చెప్పబోతున్నారని ముమ్మరంగా ప్రచారం జరుగుతోంది.
చాలాకాలంగా పార్టీపై సున్నితంగా విమర్శలు గుప్పిస్తున్న వైసీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కూడా త్వరలోనే పార్టీకి రాంరాం చెప్పబోతున్నారని పుకార్లు వినిపిస్తున్నాయి. మంత్రి పదవి దక్కలేదని అసంతృప్తితో ప్రసన్నకుమార్ రెడ్డి రగిలిపోతున్నారని, రెండో మంత్రివర్గ విస్తరణలో అయినా తనకు మంత్రి పదవి దక్కుతుందని ఆశించ భంగపడ్డారని టాక్ వస్తోంది. మంత్రి పదవి దక్కకపోయినా కనీసం తనకు రావాల్సిన పెండింగ్ బిల్లులు కూడా రావట్లేదని తన అనుచరుల దగ్గర ప్రసన్నకుమార్ రెడ్డి వాపోయారట.
ఇక, పార్టీలో కనీస గౌరవం దక్కడం లేదని, 2012 నుండి జగన్ కు అండగా నిలిచినా పెద్దగా ఒరిగిందేమీ లేదని ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. ఈ క్రమంలోనే టీడీపీ లేదా బీజేపీలలో ఒక పార్టీలో చేరే చేరడం తప్ప వేరే ఆప్షన్ లేదని అనుచరులతో జరిగిన ఆత్మీయ సమావేశంలో ఆయన వాపోయారట. ఏ విషయంపై మరికొద్ది రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. టిడిపి చెబుతున్న 40 మంది అసంతృప్త వైసిపి నేతల జాబితాలో ప్రసన్నకుమార్ రెడ్డి కూడా ఉన్నారని టాక్ వస్తోంది.
అయితే, నలుగురు ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటుపడిన వెంటనే ప్రసన్నకుమార్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి టీడీపీ, చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించడం కొస మెరుపు.