కొలుసు పార్థసారథి.. వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుతం పెనమలూరు నియోజకవర్గం నుంచి ప్రాతినిద్యం వహిస్తున్న ఎమ్మెల్యే. అయితే.. ఈయన కొన్నాళ్లుగా వైసీపీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తనను పట్టించుకోవడంలేదని.. నియోజకవర్గం ప్రజలైనా తనను గుర్తించారు తప్ప.. జగన్ తనను గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తంచేస్తూ.. పార్టీపై రుసరుసలాడారు. అంతేకాదు. . బీసీలను వాడుకోవడమే తప్ప.. వారికి ప్రయోజం ఏమీలేదని సీఎం జగన్‌పై విమర్శలు గుప్పించారు
ఈ క్రమంలోనే కొలుసు టీడీపీకి చేరువయ్యారు. నారా లోకేష్‌తో ఆయన చర్చలు జరిపారని వార్తలు కూడా వచ్చాయి. తర్వాత.. హైదరాబాద్‌లో రహస్యంగా చంద్రబాబుతోనూ భేటీ అయ్యారని ప్రధాన మీడియా తెలిపింది. ఈ నేపథ్యంలో ఆయన టీడీపీలోకి ఎంట్రీ ఇస్తున్నారనేది చర్చగా మారింది. దీనిపై ఇప్పటి వరకు ఇటు టీడీపీ కానీ, అటు కొలుసు పార్థసారథి కానీ.. ప్రకటనలు చేసింది లేదు. కానీ, తెరచాటున మాత్రం పార్టీలోనూ.. ఇటు నాయకుడి పరంగా వ్యూహాలు కొనసాగుతున్నాయి.
కొలుసును తీసుకునేందుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తాజాగా జరిగిన పరిణామాలను బట్టి.. ఆయన ఫిబ్రవరి 1న టీడీపీలో చేరేందుకు రంగం రెడీ అయింది. ముహూర్తం కూడా బాగుందని కొలుసు అనుచరులు తాజాగా ఆఫ్ దిరికార్డులో మీడియాకు తెలిపారు. ఆ రోజున చంద్రబాబు సమక్షంలో కొలు సు టీడీపీ సైకిల్ ఎక్కుతున్నారని చెప్పారు. ఇదిలావుంటే.. కొలుసు కు వచ్చే ఎన్నికల్లో ఎక్కడ టికెట్ ఇస్తారనేది చర్చగా మారింది. ఆయన పెనమలూరును కోరుకుంటున్నారు.
కానీ, క్షేత్రస్థాయిలో టీడీపీకి బోడే ప్రసాద్ ఉన్నారు. 2014లో విజయం దక్కించుకున్న ఈయన గత ఎన్నికల్లో ఓడిపోయినా.. పార్టీని, కేడర్‌ను కాపాడుకుంటూ వస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిచి తీరుతానని కూడా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బోడే ప్రసాద్‌ను కాదని టికెట్ ఇచ్చే పరిస్థితి టీడీపీలో లేదు. దీంతో కొలుసును నూజివీడుకు పంపించాలని భావిస్తున్నారు. అయితే.. అక్కడ కూడా నాయకులు ఉన్నారు. దీంతో ఈ విషయం ప్రస్తానికి ఎటూ తేలలేదు. మరి ఏం చేస్తారో చూడాలి.